కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళల కోసం షీ-షట్లర్ (She Shuttle) ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్, న్యూల్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బస్సును ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ బస్సు ఇస్నాపూర్ నుంచి ఇంద్రకరణ్ రూట్‌లో నడవనుంది. ఆ మార్గంలో ప్రయాణించే మహిళలు, పాఠశాల విద్యార్థులు బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ బస్సు జీపీఎస్‌కు అనుసంధానమై ఉండటంతో బస్సు లోకేషన్, సమయ వివరాలను తెలుసుకోవచ్చు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమలలో విధులు నిర్వహిస్తున్న మహిళలకు ఈ బస్సు వరంగా మారనుందని ఎస్పీ అన్నారు. సురక్షిత ప్రయాణం కోసం “షీ-షట్లర్” ప్రత్యేక బస్సును ప్రారంభించామని ఆయన తెలిపారు.


