కలం, వరంగల్ బ్యూరో : స్టేషన్ ఘనపూర్ కు మరో 3500 ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. నియోజకవర్గం చిల్పూర్ మండలం శ్రీపతిపల్లిలో ఇందిరమ్మ ఇంటిని కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలోనే నిరుపేదల సొంతింటి కల వాస్తవ రూపం దాలుస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 22వేల 500కోట్ల రూపాయలతో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. 85శాతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందన్నారు.
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) నియోజకవర్గానికి మరొక 3,500 ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని తెలిపారు. ఈసారి ప్రభుత్వం లబ్ధిదారులకు కొన్ని వెసులుబాటులు కల్పించిందని.. అనుమతులు రాకముందే బేస్మెట్ కట్టుకున్న వాళ్లకు, గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయి బేస్మెట్ వరకే నిర్మాణం చేసుకున్న వారికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న మూడేళ్లలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే కడియం (Kadiyam Srihari) హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Also: అజిత్ పవార్ మృతికి హెరిటేజ్‌కు లింక్: రోహిత్ పవార్
Follow Us On: X(Twitter)


