epaper
Tuesday, November 18, 2025
epaper

దేశదేశాలను వణికిస్తోన్న ‘జెన్ జెడ్’ జనరేషన్

కలం డెస్క్ : చాలా దేశాలకు ఇప్పుడు జెన్ జెడ్ (జెనరేషన్ జెడ్) గుబులు పట్టుకున్నది. గతంలో జెన్-ఎక్స్, జెన్-వై ఆందోళనలకు ఉన్నత రూపంగా ఉనికిలోకి వచ్చిన జెన్-జెడ్ నేపాల్ లో ఇటీవల తన శక్తిని చాటింది. పాలకులు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తే యువతరం ఒక్కటై వీధుల్లోకి వచ్చి బుద్ధి చెప్పే చైతన్యాన్ని సంతరించుకున్నది. 1980వ దశకంలో విద్యార్థిలోకం ఏకమై తియాన్ మెన్ స్క్వేర్ లో చేపట్టిన ఆందోళన చైనా ప్రభుత్వాన్నే గడగడలాడించింది. యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆనాడు మొదలైన చైతన్య స్రవంతి అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని వినియోగించుకుంటూ కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ మొదలు పాలకుల నిరంకుశ వైఖరిని ప్రశ్నించడమే కాక పారదోలే శక్తిని సంతరించుకున్నది.

జెనరేషన్ ప్రభంజనం :

సంప్రదాయ పద్దతిలో ధర్నాలు, రాస్తారోకోలు, బంద్ ల దశను దాటి పాలక వ్యవస్థను ప్రక్షాళన చేసే జెనరేషన్ ఆవిర్భవించింది. నేపాల్ లో ఇటీవల జరిగిన ఆందోళనలను జెన్-జెడ్ గా పిల్చుకుంటున్నాం. జనరేషన్ ఎక్స్ ను ప్రశ్నించే తరం, జెనరేషన్-వై ను ఆందోళనలకు వీలుగా సరైన వేదికలను ఏర్పాటు చేసుకునే తరం, జెనరేషన్-జెడ్ ను సమాజంలో మార్పును సాధించే తరం.. ఇలాంటి గుర్తింపులు ఏర్పడ్డాయి. ఆయా కాలాల్లోని పరిస్థితులకు అనుగుణంగా జెనరేషన్ ఎక్స్, వై, జెడ్ ఆవిర్భవించాయి. ప్రశ్నించే గొంతులను పాలకులు, పాలనా వ్యవస్థలు నొక్కేస్తున్నప్పుడు ప్రజాస్వామిక స్ఫూర్తిగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు యువత. ఆ ప్లాట్ ఫారం ను విస్తృతంగా వాడుకుంటున్నారు. ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు.

జెనరేషన్ ఎక్స్ :

టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న ప్రారంభ దశలో సమాజంలోని నిరాశా నిస్పృహలు, న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థ, తరాల మధ్య అంతరాలు, ఆలోచనల్లో వస్తున్న మార్పులు.. ఇలాంటి పరిస్థితుల్లో అసంఘటితంగా, అసంకల్పితంగా ఐక్యంగా ఉద్యమించడాన్ని జెన్-ఎక్స్ అని పిల్చుకుంటున్నాం. టెక్నాలజీలో వస్తున్న మార్పుల సమయంలో జెన్-ఎక్స్ ఉనికిలోకి వచ్చింది. కంప్యూటర్, ఇంటర్నెట్ టెక్నాలజీ ప్రారంభ దశలో ప్రత్యక్ష నిరసనల స్థానంలో వినూత్నమైన సాంస్కృతిక ఉద్యమం జెన్-ఎక్స్ పేరుతో అప్పటి యువత ద్వారా మొదలైంది. పలు దేశాల్లో 1965-80 మధ్య కాలంలో జరిగిన ఉద్యమాలను జెన్-ఎక్స్ కేటగిరీగా పరిగణిస్తున్నాం.

జెనరేషన్ వై :

మిలీనియల్స్ గా పిల్చుకునే ఈ తరాన్ని జెన్-వై గా పరిగణిస్తున్నాం. 1981-96 మధ్యకాలంలో పుట్టినవారు ఒక సామాజిక లక్ష్యంతో ఉద్యమ కార్యాచరణను ఎంచుకుంటున్నారని, అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని వినియోగించుకుంటూ ఐక్యంగా పోరాటంలోకి దూకుతున్నారని విశ్లేషకుల భావన. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడమే కాక టెక్నాలజీ నడుమనే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు. వివిధ రూపాల్లోని సామాజిక రుగ్మతల బారిన పడినప్పుడు వాటిని అధిగమించడానికి ఎంచుకునే పోరాట రూపాలు జెన్-ఎక్స్ తో పోలిస్తే మిలిటెంట్ గా ఉండడం జెన్-వై ప్రత్యేకత. జెన్-ఎక్స్ ప్రశ్నించే తత్వం నుంచి కార్యాచరణలోకి మార్పు చెందే దశలో తగిన వేదికను నిర్మించడంలో జెన్-వై యువత ముఖ్య భూమిక పోషిస్తున్నది. అందుకే జెన్-వై కేటగిరీని మార్పు కోసం సరైన వేదికలను నిర్మించిన తరంగా గుర్తిస్తున్నాం.

దీనికి నిదర్శనమే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామిక వాతావరణం కోసం మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో 2010-11లో జరిగిన అరబ్ స్ప్రింగ్ (తిరుగుబాటు), 2011లో జరిగిన ఆక్యుపై వాల్ స్ట్రీట్ లాంటి ఉద్యమాలు. 2008లో ప్రపంచంలోని పలు దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితుల తర్వాత ఈ ఉద్యమాలు చోటుచేసుకోవడం గమనార్హం. దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా గ్లోబల్ కనెక్టివిటీ, జీతం కంటే జీవితం ముఖ్యం అనే భావనలతో ఈ తరం ఉద్యమాల్లోకి దూకింది.

జెన్-జెడ్ మిలిటెంట్ పోరాటం :

జెన్-వై తర్వాత తరంగా 1997-2011 మధ్యలో పుట్టినవారు చేపట్టే ఉద్యమాలకు మిలిటెన్సీ తోడుకావడంతో నేటి తరానికి జెన్-జెడ్ దిక్సూచిగా మారింది. అందుకే శ్రీలంకలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన యువత ఆదర్శంగా ఆ తర్వాత బంగ్లాదేశ్, తాజాగా నేపాల్ లో విద్యార్థులు, యువతే నాయకత్వం వహించి ఉద్యమాలు నిర్వహించి పాలకులను గద్దె దించారు. వీరు చేపట్టిన ఉద్యమాలకు డిజిటల్ టెక్నాలజీ తోడుకావడంతో సోషల్ మీడియా వేదికగా ఐక్యత సాకారమైంది. జెన్-జెడ్ తరానికి చెందిన యువత పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో పెరిగి సామాజిక స్పృహలో ఒకింత చైతన్యవంతులయ్యారు.

సొసైటీ, పాలిటిక్స్, క్లైమేట్ ఛేంజ్, పర్యావరణ ప్రాముఖ్యత.. ఇలాంటి అంశాలపై స్పష్టమైన అవగాహన వీరి సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్ను. అందుకే గ్రేట్ థన్ బర్గ్ లాంటి బాలికలు ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’ పేరుతో పర్యావరయ పరిరక్షణ కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పలు దేశాల్లోని ఆ తరం యువతను ఒక్కటి చేయగలిగారు. నల్ల జాతీయులు వారి హక్కుల కోసం గొంతెత్తారు. లింగసమానత్వం కోసం స్త్రీ పురుషులు నడుం బిగించారు. సామాజిక హక్కు కావాలంటే ఎల్జీబీటీలు ఖండాలు, దేశాలకు అతీతంగా నినదించారు.

డిజిటల్ టెక్నాలజీ అడ్వాంటేజ్ :

సోషల్ మీడియా విస్తృతంగా ఉనికిలోకి, వినియోగంలోకి రావడంతో హ్యాష్ ట్యాగ్ ద్వారా వేర్వేరు ప్రాంతాల్లోని యువతను ఒక్క తాటి మీదకు తేవడం జెన్-జెడ్ ప్రత్యేకత. గ్యాంగ్ రేప్, ర్యాగింగ్, సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలపై ‘మీ టూ’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ విప్లవం చోటుచేసుకున్నది. మీమ్స్ రూపకల్పన, దాని ఆధారంగా విస్తృత సంఖ్యలో యూత్ ను కూడగట్టడం జెన్-జెడ్ సొంతం. నేపాల్ లో జెన్-జెడ్ ఆందోళనతో ప్రభుత్వమే మారిపోవడంతో ఇప్పుడు పలు దేశాల్లో యూత్ ఏ టైమ్ లో ఎలా స్పందిస్తారో.. ఎలాంటి ఉప్రదవం ముంచుకొస్తుందో.. అనే ఆందోళన పాలకుల్లో నెలకొన్నది. అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా ఏ మూవ్ మెంట్ ఎలా బద్దలవుతుందో ఊహకు అందకపోవడంతో అవినీతి సంపదను పోగేసుకున్న రాజకీయ నాయకుల్లో గుబులు మొదలైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>