epaper
Sunday, February 22, 2026
epaper

కామారెడ్డిలో హైటెన్షన్ : కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ

కలం, నిజామాబాద్ బ్యూరో : కాంగ్రెస్ నేతల సవాళ్లు, బీజేపీ ఎమ్మెల్యే ప్రతిసవాళ్లతో కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రం అట్టుడుకుతోంది. శనివారం కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తుల విషయంలో చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి (MLA Venkataramana Reddy) ఈ సవాల్‌ను స్వీకరించారు. దీంతో హైటెన్షన్ పాలిటిక్స్‌తో కామారెడ్డి రణరంగంగా మారింది.

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములను ప్రైవేటు కాలేజీకి అప్పగిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. తాను వస్తున్నానని ఎమ్మెల్యే ప్రకటించడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎన్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ ఆధ్వర్యంలో విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు డిగ్రీ కాలేజీ వద్దకు చేరుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, కళాశాల పరిరక్షణ కమిటీ కూడా చర్చకు ఖచ్చితంగా రావాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డిగ్రీ కాలేజీ మైదానం వద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం సందీప్‌తో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కాంగ్రెస్ నాయకుని కారు ధ్వంసం

మరోవైపు కామారెడ్డి (Kamareddy) బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పోసానిపేట్ మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి కారులో నేరుగా బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి ఒక్కసారిగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా, షబ్బీర్ అలీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్యాంప్ ఆఫీస్ ఎదుట మహేందర్ రెడ్డి కారును బీజేపీ నాయకులు ధ్వంసం చేసి తోసేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ తోపులాటలో హోంగార్డ్ వసంతరావుకు గాయాలయ్యాయి.

బీజేపీ కార్యకర్తలు కామారెడ్డికి రావొద్దు

బీజేపీ కార్యకర్తలు, తన అభిమానులు కామారెడ్డికి రావొద్దని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కోరారు. కాలేజీ అంశం తన వ్యక్తిగతమని, తానే చూసుకుంటానని చెప్పుకొచ్చారు. తాను డిగ్రీ కాలేజీ ఆస్తుల విషయంలో ఏ చర్చకైనా, ఎక్కడైనా సిద్ధమేనని ప్రకటించారు. కాంగ్రెస్ నాయకుల సవాళ్లు, బీజేపీ ఎమ్మెల్యే ప్రతిసవాళ్ల నడుమ కామారెడ్డిలో జరుగుతున్న ఘటనలతో జిల్లా కేంద్రం ఒక్కసారిగా వేడెక్కింది. డిగ్రీ కాలేజీ గ్రౌండ్ పక్కనే ఉన్న సరస్వతి శిశు మందిర్ స్కూల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.

 Read Also: AI సమ్మిట్‌లో కాంగ్రెస్ ఆందోళన: కేటీఆర్ రియాక్షన్​ ఇదే

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>