కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (AI Impact Summit) వేదికగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచాల్సిన ఇలాంటి వేదికలను చిల్లర రాజకీయాలకు వాడుకోవడం అత్యంత శోచనీయమని ఆయన మండిపడ్డారు. గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ఇటువంటి ప్రదర్శనలు చేయడం వల్ల ప్రపంచ దేశాల ముందు మన దేశ గౌరవం మసకబారుతుందని అన్నారు.
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే అయినప్పటికీ, నిరసన తెలపడానికి ఎక్కడ, ఎలా వ్యవహరించాలనే కనీస అవగాహన ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయని, కానీ అంతర్జాతీయ సదస్సులు ఖచ్చితంగా అందుకు వేదికలు కావని ఆయన తెలిపారు. బాధ్యతాయుతమైన రీతిలో ప్రవర్తించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే, అదే పార్టీకి చెందిన యూత్ కాంగ్రెస్ (Youth Congress) సభ్యులు ఈ ఆందోళనలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు సొంత పార్టీ ముఖ్యమంత్రి వేదికపై మాట్లాడుతుంటే, మరోవైపు అదే పార్టీ శ్రేణులు నిరసనలకు దిగడం ఏంటని కేటీఆర్ (KTR) ప్రశ్నించారు.
Read Also: FSL అగ్నిప్రమాదంలో సంచలనం.. కీలక డేటా గల్లంతు
Follow Us On: Instagram


