కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా పలమనేరు (Palamaneru) పట్టణంలో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. నమ్మకమే పెట్టుబడిగా సామాన్యుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఒక చీటీల వ్యాపారి, చివరకు చేతులెత్తేసి ఐ.పి. పెట్టడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
పలమనేరు (Palamaneru)కు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి గత కొంతకాలంగా చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా అతని మాటలు నమ్మి సుమారు 13 కోట్ల రూపాయల వరకు చీటీలు వేశారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, సదరు వ్యాపారి తాను దివాళా తీసినట్లు కోర్టులో ఐ.పి. దాఖలు చేసి బాధితులకు షాక్ ఇచ్చాడు.
అంతేకాకుండా వెంకట్రావు తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా కనిపించకుండా మాయమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద సంఖ్యలో అతని ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమ కష్టార్జితం ఒక్కసారిగా ఆవిరైపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


