epaper
Sunday, February 22, 2026
epaper

యాదాద్రి జిల్లాలో పేలిన కెమికల్ డ్రమ్.. ఒకరి సజీవ దహనం

కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కెమికల్ కంపెనీలో పేలుడు జరిగి ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి (Yadadri Distrct) జిల్లా చౌటుప్పల్ మండలం దోతిగూడెంలో విజయసాయి కెమికల్ ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్‌లోని నాలుగో బ్లాక్‌లో కెమికల్స్ మిక్స్ చేస్తుండగా, ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ధార పవన్(30) అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.

పవన్ కెమికల్ డ్రమ్‌ను తెరిచి ఒక రాడ్‌తో మిక్స్ చేస్తున్న క్రమంలో రాపిడి కలిగి మంటలు ఎగసిపడ్డాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ల్యాబ్ మొత్తం వ్యాపించాయి. పవన్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మంటల ధాటికి కెమికల్ అంతా ల్యాబ్ బయటకు ప్రవహించింది. సంఘటన మధ్యాహ్నం లంచ్ సమయంలో జరగడం.. మిగిలిన కార్మికులు బయట ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.

మృతుడు పవన్ ఐదేళ్లుగా ఇదే కంపెనీలో కెమిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య.. ఒక చిన్న పాప ఉన్నారు. రోజూ మధ్యాహ్నం ఇంటికి వెళ్లి లంచ్ చేసే పవన్.. ఆరోజు పని ముగించుకుని మరో 15 నిమిషాల్లో బయటకు వస్తాడనగా ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న భార్య ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది.

కాగా, ప్రమాదాన్ని కంపెనీ యాజమాన్యం మొదట గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ అగ్ని ప్రమాదం వల్ల మంటలు చెలరేగాయని నమ్మించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ, సీసీ టీవీ ఫుటేజీలో అసలు విషయం బయటపడింది. మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు(Yadadri Distrct).

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>