కలం, వెబ్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య సత్సంబంధాల విషయంలో మరో కీలక పురోగతి. శుక్రవారం న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ తిరిగి తెరుచుకుంది. బంగ్లాదేశ్లో తారిఖ్ రహ్మాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకమిషన్ తిరిగి తెరుచుకోవడంతో ఉదయం నుంచే పర్యాటక, వైద్య, వ్యాపార, ఉద్యోగ సహా అన్ని వీసాలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.
భారత్ సానుకూల సంకేతాలు..
అంతకుముందు భారత్ కూడా సానుకూలంగా స్పందించింది. బంగ్లాదేశ్లో సీనియర్ కాన్సులర్ అధికారి అనిరుద్ధ దాస్ మాట్లాడుతూ.. బంగ్లా పౌరులకు పూర్తి స్థాయి వీసా సేవలను త్వరలోనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వైద్య, డబుల్ ఎంట్రీ వీసాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. త్వరలో ఇతర వీసాలూ ప్రారంభమవుతాయని చెప్పారు.
కాగా, బంగ్లాదేశ్లో(Bangladesh) విద్యార్థుల ఆందోళన కారణంగా ఏడాదిన్నర కిందట అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, భారత్లో తలదాచుకోవడం.. అనంతరం మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక భారత్ వ్యతిరేక అల్లర్లు తీవ్రమవడం తెలిసిందే. దీని వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ అధికారంలోకి రావడం, తారిఖ్ రహ్మాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ భారత్తో సత్సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.


