కలం, నిజామాబాద్ బ్యూరో: గంజాయి బ్యాచ్ కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. గంజాయిని సెల్ఫోన్లలో బుక్ చేయిస్తూ(Mobile Based Drug Racket) సరఫరా చేస్తోంది. మహారాష్ట్ర(Maharashtra) నుంచి ఎండు గంజాయి నిజామాబాద్ (Nizamabad)జిల్లాకు విచ్చలవిడిగా సరఫరా చేస్తోంది. ఇందుకోసం స్మగ్లర్లు నిజామాబాద్ జిల్లాలో స్టూడెంట్స్, చిరు వ్యాపారులు ఆఖరికి అనుమానం రాకుండా ఉండేందుకు బాల నేరస్థులను కూడా వాడుకుంటోంది. బాల్కొండలో 1.2 కిలోల ఎండు గంజాయి పట్టుకున్నారు.. ఈ సందర్బంగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నిజామాబాద్ కమిషనరేట్ బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా పోలీసులు దాడి నిర్వహించారు..
విశ్వసనీయ సమాచారం మేరకు బాల్కొండ శివారులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలోని ఓపెన్ గ్రౌండ్ వద్ద కొందరు వ్యక్తులు నిషేధిత గంజాయి విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ పక్కన గల ఖాళీ ప్రదేశంలో అంజద్ తెచ్చిన గంజాయిని తీసుకునేందుకు నయీమ్, అద్నాన్, మనోజ్, గోవిందు మరో బాల నేరస్థుడు రాగా నిందితులను పట్టుకున్నారు.. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించగా వారి వద్ద నుండి మొత్తం 1.2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.30,000 ఉంటుందని పోలీసు కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
విచారణలో నిందితుడు అంజద్ మహారాష్ట్ర(Maharashtra)లోని కిన్వట్ ప్రాంతం నుండి కిలోకు సుమారు రూ.20,000 చొప్పున గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లా బాల్కొండ, పెర్కిట్, ఆర్మూర్ ప్రాంతాల్లో 5 గ్రాముల చిన్న ప్యాకెట్లుగా విభజించి ఒక్కో ప్యాకెట్ రూ.400 నుండి రూ. 500 వరకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. వీరు మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్డర్లు స్వీకరించి నిర్ణీత ప్రదేశాల్లో సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక విశ్లేషణకు పంపించబడ్డాయని తెలిపారు.


