కలం, వెబ్ డెస్క్: లోక్‌సభ ఎంపీ రికీ ఏజే సింగ్కాన్(54) హఠాన్మరణం చెందారు(Ricky AJ Syngkon). మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో గురువారం సాయంత్రం కలసి ఫుట్‌బాల్ ఆడుతుండగా కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలారు. వెంటనే ఆయన్ని స్నేహితులు సమీపంలోని మవలై మవియోంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో జైయావ్లోని గోర్డాన్ రాబర్ట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
మేఘాలయలోని షిల్లాంగ్ నుంచి రికీ ఆండ్రూ జె సింగ్కాన్ (Ricky AJ Syngkon) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ(వీపీపీ) నుంచి ఎన్నికయ్యారు. గతంలో ఈ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు ఎన్నికైన కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ విన్సెంట్ హెచ్ పాలాను 3లక్షల 70 వేల ఓట్ల భారీ తేడాతో సింగ్కాన్ ఓడించారు.
సింగ్కాన్ మృతికి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ తియాన్సాంగ్ తదితరులు సంతాపం తెలిపారు.


