కలం, వెబ్ డెస్క్: ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ సెగ చల్లారడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసులో ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, రాజకుటుంబాల వాళ్లు, వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా దిగ్గజాలు, ధనవంతులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో తొలి అరెస్ట్ నమోదైంది (Andrew Mountbatten). బ్రిటన్ రాజు కింగ్ చార్జెస్ 3 సోదరుడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండ్సర్ను యూకే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆయన పేరును పోలీసులు నేరుగా వెల్లడించలేదు. పదవీ దుర్వినియోగం కేసులో ఓ ప్రముఖుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
కాగా, ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఆండ్రూ పేరు బయటపడడం బ్రిటన్ రాజకుటుంబంలో చిచ్చు రేపింది. దీనిపై మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో ఆండ్రూ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్‌కు సొంత సోదరుడైన ఆండ్రూపై గతంలోనూ ఓ మహిళ లైంగిక ఆరోపణలు సైతం చేసింది. తాను మైనర్‌గా ఉండగా లైంగిక దాడి చేశారని ఆరోపించింది. దాంతో అప్పట్లో తన గౌరవ సూచకమైన టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ను ఆండ్రూ వదిలేసుకోవాల్సి వచ్చింది. అలాగే రాజకుటుంబానికి లభించే గౌరవాలు, అధికారాలను కూడా తొలగించినట్లు రాజకుటుంబ అధికారిక నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. అంతేకాదు, బలవంతంగా ఇంటి నుంచి పంపించేసింది.
ఈ క్రమంలో ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఆండ్రూ (Andrew Mountbatten) పేరు రావడం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇప్పటికే రాజకుటుంబం పరువు బజారున పడేలా వ్యవహరించిన ఆండ్రూ.. ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్‌తో మరింత దిగజార్చినట్లు భావించింది. కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ఆండ్రూతోపాటు తామూ చులకన అవుతామని తలచింది. అందుకే తాము బాధితుల వైపే ఉంటామని ఇప్పటికే బ్రిటన్ రాజు ఛార్లెస్, రాణి కెమిల్లా ప్రకటించారు. ఈ క్రమంలో హఠాత్తుగా ఆండ్రూ అరెస్ట్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు, ఆండ్రూ మౌంట్‌బాటన్ గురువారం 66వ పుట్టినరోజులోకి అడుగుపెట్టడం గమనార్హం.


