కలం, నల్లగొండ : న్యాయవాది కుటుంబంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నల్లగొండ (Nalgonda) బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం కోర్టు విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది న్యాయవాదులు ఎస్సైకి ఫిర్యాదు చేశారు. దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది జి.నరేష్ నివాసంపై బుధవారం రాత్రి కొంతమంది దుండగులు దాడి చేసి.. హత్య చేయాలని చూశారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, కార్యదర్శి మంద నగేష్ అన్నారు. వీరిద్దరూ మాట్లాడుతూ.. నరేష్ భార్యపై, చిన్న కూతురిపై విచక్షణారహితంగా దాడి చేయడం మనసును కలచివేసే ఘటన అన్నారు. ఇది వ్యక్తిపై దాడి కాదని, న్యాయవృత్తిపై దాడి అని చెప్పారు.
ఐదారేళ్లుగా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని పోరాటం చేస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని.. అనంతరెడ్డి, నగేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయపాలనకు ముప్పు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల హక్కుల రక్షణకు చట్టంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభల్లో “న్యాయవాదుల రక్షణ చట్టం” బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలి’ అని అనంతరెడ్డి, నగేశ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ ఠాగూర్, జె.భాస్కర్ రెడ్డి, ఎం.నాగిరెడ్డి, టి.కిషోర్ కుమార్, పి.శేఖర్, జనిగల రాములు, జి.ఎన్.ఎస్ ప్రసాద్, అన్నపూసల ఐలయ్య, బి అశోక్ కుమార్, మేక యాదగిరి రెడ్డి, ఎం.ప్రమీల, ఎన్.భాగ్యమ్మ, టి.వరుణ శ్రీ, ఎ.వెంకట్ రెడ్డి, కొండ శ్రీనివాస్, బి.మధు, ముక్కెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


