కలం, వెబ్ డెస్క్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆటతీరుపై మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ డకౌట్ అవడంపై ఇర్ఫాన్ స్పందించాడు. ఎప్పటికీ భారీ షాట్లు కొట్టడంపైనే ఫోకస్ పెడితే అభిషేక్ గట్టెక్కడని.. సింగిల్స్, డబుల్స్ తీయడం కూడా నేర్చుకోవాలని హితవు పలికాడు.
టీ20 వరల్డ్ కప్‌లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డక్ అయ్యాడు. తర్వాత పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌ల్లోనూ సున్నాకే వెనుదిరిగాడు. దీనిపై ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. అభిషేక్ డకౌట్‌ల వెనక ప్రత్యర్థి జట్ల స్పష్టమైన వ్యూహం ఉందన్నాడు. మొదటి మ్యాచ్‌లో స్పష్టమైన ప్యాటర్న్ కనిపించలేదన్నాడు. కానీ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఒకే విధమైన వ్యూహం అమలైందని తెలిపాడు. ఆఫ్ స్పిన్నర్లు స్టంప్స్ వైపు, ముఖ్యంగా లెగ్ స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేస్తూ స్థలం ఇవ్వడం లేదన్నాడు. మిడ్-ఆన్‌ను లోపలే ఉంచుతున్నారని వివరించాడు. పాకిస్తాన్‌పై పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్ సల్మాన్ అఘా చేతిలో ఔటయ్యాడని గుర్తుచేశాడు.
కామెంటరీ సమయంలో హర్భజన్ సింగ్‌తో చర్చించానని పఠాన్ (Irfan Pathan) చెప్పాడు. ఎడమచేతి బ్యాటర్లకు రౌండ్ ది వికెట్ నుంచి బంతిని లోపలికి తిప్పితే కొత్త బంతితో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందని, అదే పరిస్థితి అభిషేక్ విషయంలోనూ జరిగిందని పేర్కొన్నాడు.
అభిషేక్ అడ్డంగా ఆడే స్వభావం కారణంగా ట్రాప్ అవుతున్నాడని ఇర్ఫాన్ విశ్లేషించాడు. ఆఫ్ స్పిన్నర్ స్థలం ఇవ్వడని ముందే అంచనా వేసుకోవాలని సూచించాడు. సాధ్యమైనంత వరకూ నేరుగా షాట్లు ఆడాలని అన్నాడు. కొంచెం వెడల్పుగా వస్తే సింగిల్ తీసుకునే ఆలోచనతో ఉండాలని చెప్పాడు. లెంగ్త్ బంతిని అడ్డంగా ఆడటం ప్రమాదమని హెచ్చరించాడు. ప్రత్యర్థి ప్లాన్‌ను గుర్తించి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
కాగా, భారత్ ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో సూపర్–8 మ్యాచ్ ఆడనుంది. ఆ జట్టు కెప్టెన్ మార్క్రమ్ ఆఫ్ స్పిన్ వేయగలడు. దీంతో ఈ మ్యాచ్‌లో అయినా, అభిషేక్ విధానంలో మార్పు ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: 2-0 లీడ్ వృథా.. చివర్లో అట్లెటికోకు షాక్!
Follow Us On: Youtube


