కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి జిల్లాలోని మణుగూరు (Manuguru), భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ (BTPS) రోడ్డు, కాలుష్యం వెదజల్లుతూ ప్రజలను అనేక ఇబ్బందుల పాలు చేస్తుంది. బీటీపీఎస్ కు బొగ్గు తీసుకెళ్లే రైలు మార్గం ఆలస్యం అవుతుండటంతో,బొగ్గు రవాణా రోడ్డు మార్గం గుండా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ రోడ్డు దశాబ్ద కాలంగా మరమ్మతులకు కూడా నోచుకోకపోవడంతో గుంతలు పడి కంకర తేలి, దుమ్ము ధూళి వెదజల్లుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి. బీటీపీఎస్ కు బొగ్గు తీసుకెళ్లే లారీలే కాకుండా ఇసుక లారీలు కూడా ఇదే రోడ్డుపై వెళ్తుండటంతో లారీల నుంచి వచ్చే కాలుష్యం, బొగ్గు వెదజల్లే కాలుష్యంతో పాటు రోడ్డు మీద ధూళి కూడా భయంకరంగా వస్తుంటుంది. ఈ కాలుష్యం వలన రోడ్డుకు సమీపంలో ఉన్న కొండైగూడెం, విజయనగరం, రామానుజవరం ప్రజలతో పాటు నిత్యం రోడ్డు మీద ప్రయాణించే వారు కూడా శ్వాస సంబంధిత ఇబ్బందులు, కళ్ల మంటలు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మరో పక్క రూ.250 కోట్లతో 5 ఏళ్ల క్రితం ప్రారంభించిన మణుగూరు – బీటీపీఎస్ (Manuguru BTPS) రైల్వే ట్రాక్ పనులు ఆలస్యం అవుతున్నాయి. జెన్కో దాదాపు 17 కిలో మీటర్ల మేర రైలు మార్గం ఏర్పాటుకు ప్రారంభించిన చర్యలు ముందుకు కదలడం లేదు. ఆలస్యానికి కారణం భూ సేకరణ సమస్యలతో పాటు, రెవెన్యూ అధికారుల అలసత్వం అనే విమర్శ కూడా ఉంది. నిర్వాసితులు నష్ట పరిహారంతో పాటు ఉద్యోగం కూడా కావాలని పట్టుపట్టడంతో పనులు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భూములు కోల్పోయిన వారు కూడా నష్టపరిహారం విషయంలో అసంతృప్తితో ఉన్నారు.
నష్ట పరిహారం విషయంలో అధికారులు పక్షపాతం చూపిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని బాధితులతో మాట్లాడి న్యాయమైన నష్ట పరిహారం ఇస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని పరిసర ప్రాంతాల ప్రజలు చెప్తున్నారు. మొత్తం మీద దశాబ్దకాలంగా రోడ్డు వేయక, అర్ధ దశాబ్ద కాలంగా రైల్వే ట్రాక్ వేయక స్థానికుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రైతులకేదీ భరోసా?.. సాయం కోసం ఎదురుచూపులు
Follow Us On : WhatsApp


