కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని, కార్మికుల శ్రమ దోపిడీని అరికట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హెచ్చరించారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే విలీనానికి సంబంధించిన బిల్లు పాస్ అయిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని, కేవలం అమలు చేస్తే సరిపోతుందని అన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మంచిదే అయినా, దానికి తగినట్లుగా బస్సుల సంఖ్యను పెంచకపోవడం వల్ల సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోందని కవిత అన్నారు. రోజుకు 16 నుంచి 18 గంటల పాటు పని చేయిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చిన్న చిన్న కారణాలకే ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమని ఆమె పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని, ప్రతి సమస్యకు ఇతర మంత్రులను కలవమని చెప్పడం సరికాదన్నారు.
ఆర్టీసీని మేఘా సంస్థకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవడం వల్ల సంస్థ నిర్వీర్యం అవుతుందని, శాశ్వత ఉద్యోగులనే నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో యూనియన్లను రద్దు చేసిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే వాటిని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీకి తక్షణమే చైర్మన్‌ను నియమించాలని, సంస్థ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న ‘ఛలో సెక్రటేరియేట్’ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
గతంలో క్యాబినెట్ ఎర్రవెల్లికి వెళ్లేదని, ఇప్పుడు ఢిల్లీకి వెళ్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే మంత్రివర్గ సమావేశాలు సచివాలయంలోనే జరగాలని సూచించారు. కేటీఆర్ పక్కన ఉద్యమ ద్రోహులు ఉన్నారన్న విమర్శలపై స్పందిస్తూ, ఎవరు ఉద్యమకారులో ఎవరు ద్రోహులో ప్రజలే తేలుస్తారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీకి తగిన నిధులు కేటాయించాలని, తొలగించిన 1000 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కవిత (Kavitha) డిమాండ్ చేశారు.
Read Also: లీగల్ చిక్కుల్లో జీహెచ్ఎంసీ విభజన..
Follow Us On: X(Twitter)


