కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల గైడ్‌లైన్స్‌ను మార్చింది (Indiramma Indlu). ఇండ్ల నిర్మాణంలో ఇంతకుముందు ఉన్న ‘ఫ్రెష్ గ్రౌండింగ్’ నిబంధనను సడలించింది. ఇందిరమ్మ లేదా గృహలక్ష్మి పథకం కింద లేదా ఇప్పటికే సొంతంగా బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తిచేసిన లబ్ధిదారులు ఇకపై అక్కడి నుంచే కట్టుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే, దీనికి షరతులు విధించింది.
- ఇందిరమ్మ ఇండ్ల పథకం మార్గదర్శకాల ప్రకారం ఇల్లు 400–600 చదరపు అడుగుల మధ్య ఉండాలి. ఒకవేళ ఇప్పటికే నిర్మించిన ఇంటి బేస్మెంట్ 400 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉంటే, అదనంగా బీమ్స్ వేసి ఆ స్థాయికి చేర్చాలి. అలాగే 600 చదరపు అడుగులకు మించి ఉంటే 600కు తగ్గించాలి.
- లబ్ధిదారులు ఇప్పటికే బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తిచేసినందున బీఎల్(బేస్మెంట్ లెవెల్) నిధులు చెల్లించరు. మిగిలిన రూ.4లక్షలను తర్వాతి దశలు పూర్తిచేశాక, విడతల వారీ చెల్లిస్తారు. అంటే పైకప్పు దశ వరకు రూ.1లక్ష, పైకప్పు పూర్తిచేశాక–రూ.2లక్షలు, ఫినిషింగ్–రూ.లక్షను ఆయా దశలన్నీ పూర్తయ్యాకే ఇస్తారు.
- సడలించిన కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారుల అర్హతలను అన్ని కోణాల్లోనూ మళ్లీ పరిశీలిస్తారు.
ఈ మేరకు (Indiramma Indlu) కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీహెచ్సీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


