కలం, నల్లగొండ బ్యూరో : 54 మంది ప్రొబేషనరీ గ్రూప్ 1 ఆఫీసర్లు (Group 1 Officers) రెండు రోజుల పాటు శిక్షణ కోసం నల్లగొండ జిల్లా (Nalgonda) కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ ప్రొబేషనరీ గ్రూప్ 1 అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు సూచనలు చేశారు. నల్లగొండ సమగ్ర వివరాలను అందించారు. తెలంగాణలోనే నల్లగొండ జిల్లా అతిపెద్దదని, 566 రెవెన్యూ గ్రామాలు, 869 గ్రామపంచాయతీలు ఉన్నాయని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 16 లక్షల 18 వేల జనాభా ఉందని, 61శాతం అక్షరాస్యత ఉన్న జిల్లాలో సుమారు 77 శాతం ప్రజలు వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు.
జిల్లాలో (Nalgonda) మారుమూల గిరిజన ప్రాంతాలు నాగర్జునసాగర్ ప్రాజెక్టు కింది కమాండ్ ఏరియాలో ఉండే మిర్యాలగూడ, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయని, మారుమూల గిరిజన ప్రాంతాలలో కమ్యూనికేషన్ సదుపాయాలు కొన్ని గ్రామాలలో ఉన్నాయని తెలిపారు. గ్రూప్ -1 శిక్షణ అధికారులు వారి శిక్షణలో భాగంగా గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేసిన అనంతరం ముఖ్యమైన పారామీటర్స్ పై నివేదిక తయారు చేసుకోవాలని, ఇది భవిష్యత్తు పరిపాలనలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ శిక్షణ భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని, అందువల్ల ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కాగా 54 మంది శిక్షణ గ్రూపు-1 అధికారులు మంగళ, బుధ రెండు రోజులపాటు జిల్లాలోని కొండమల్లేపల్లి మండలం చెన్నమనేనిపల్లి, పీఏ పల్లి మండలం ఆర్ఆర్ గూడెం, చింతపల్లి మండలంలోని గొల్లపల్లి, దేవరకొండ మండలం మైనంపల్లి, తూర్పుపల్లి, వేములపల్లి మండలం శెట్టి పాలెం, లక్ష్మీదేవి గూడెం, మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్, యాద్గార్ పల్లిలలో సందర్శించి గ్రామీణ ప్రాంతంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, గ్రామీణ జీవన విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు, ఎంసిహెచ్ఆర్డి కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు ఉన్నారు.
Read Also: కుమారుడి చావును తట్టుకోలేక ఉరేసుకున్న తల్లిదండ్రులు
Follow Us On : WhatsApp


