కలం, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ సైన్యానికి బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది (Balochistan). పాక్ ఆర్మీ వద్ద బందీగా ఉన్న బలూచ్ పోరాట యోధులను వారంలోగా విడుదల చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తమ దగ్గర బందీలుగా ఏడుగురు పాక్ సైనికులను చంపేస్తామని, అనంతరం ‘హెరోఫ్ 2’ రెండో దశ స్టార్ట్ చేస్తామని అల్టిమేటమ్ జారీ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆదివారం బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ డిమాండ్లతో కూడిన గడువును పాక్ ఆర్మీని ఉద్దేశిస్తూ పోస్ట్ చేసింది.
కాగా, పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్న బీఎల్ఏ(BLA).. ఇటీవలే హెరోఫ్ 2 పేరుతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాక్ సైన్యంతోపాటు అధికారులను, ప్రజలను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు, ఆత్మాహుతి దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో ఇరువైపులా దాదాపు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైన్యం కొంత మంది బీఎల్ఏ సభ్యులను బందీలుగా చేసుకోగా, ప్రతిగా బీఎల్ఏ సైతం కొంతమంది పాక్ సైనికులను అదుపులోకి తీసుకుంది.
మొత్తం 17 మంది తమ వద్ద బందీలుగా ఉన్నారని చెప్పిన బీఎల్ఏ.. వీరిలో 10 మందిని విడుదల చేసింది. మిగిలిన ఏడుగురిని విడుదల చేయాలంటే పాక్ సైన్యం అదుపులో ఉన్న తమవాళ్లను విడిచిపెట్టాలని కోరుతోంది. ఈ మేరకు వారం రోజుల గడువు ఇస్తూ బీఎల్ఏ (Balochistan) మీడియా వింగ్ హక్కాల్కు చెందిన జాయెద్ బలూచ్ ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, దీనిపై పాక్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
Read Also: రాజకీయ స్థిరత్వంతోనే ట్రేడ్ డీల్స్ : ప్రధాని మోదీ
Follow Us On : WhatsApp


