కలం, డెస్క్ : పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అందరూ పనిచేయాలని.. ఎవరూ లైన్ దాటొద్దని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ రెండు కోట్ల విరాళాన్ని పార్టీకి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను లోతుగా అర్థం చేసుకుని కష్టపడి పని చేసే వారు క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలా సభ్యత్వం తీసుకునే వారిని “ఉద్యమి”గా గుర్తిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. యువతలో స్ఫూర్తిని రగిలించి.. పార్టీ ఆశయాల కోసం పనిచేసే వారిని సాధక్ గా పరిగణిస్తాం అన్నారు.
పరోక్షంగా పార్టీకి ఆర్థిక సాయం, సేవా, టెక్నికల్ గా ఉపయోగపడే వారిని ప్రదాతగా గుర్తిస్తామని పవన్ వివరించారు. పార్టీని (Janasena) గతంలో తాను ఒక్కడినే ప్రారంభించానని.. ఆ తర్వాత ఆ సంఖ్య 12 లక్షలకు పైగా చేరిందని చెప్పారు. జనసేన ఎప్పుడూ అవినీతికి వ్యతిరేకంగానే పోరాడుతుందని.. ఆ లక్ష్యంతోనే పుట్టిందని పవన్ వెల్లడించారు. పార్టీలో చేరే వారు కూడా అదే లక్ష్యంతో పని చేయాలని.. సమాజంలో సమూలమైన మార్పు కోసమే ప్రయత్నించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సూచించారు.
Read Also: దేవుడిని రాజకీయాలకు దూరంగా పెట్టండి : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
Follow Us On : WhatsApp


