కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ మేయర్ సీటుపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ సీటు రేసులో ఉందని, ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మహా శివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం నేడు ఉదయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి వేములవాడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ మేయర్ పీఠం కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు. పొత్తులపై స్పందిస్తూ తమది రాజకీయ పార్టీ అని, తప్పకుండా చివరి వరకు రాజకీయం చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ మేయర్ సీటు దక్కించుకుంటామనే నమ్మకం ఉందని పొన్నం వ్యాఖ్యానించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో ఏం జరుగుతుందన్నది ఈ నెల 16 వరకు వేచి చూడాలని చెప్పారు.
ఇక గత ప్రభుత్వం దేవాలయాలను నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వేములవాడను అభివృద్ధి చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సమ్మక్క సారక్క జాతరను కూడా గతంలో ఎన్నడూ లేనంత వైభంగా చేశామని చెప్పారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు.


