కలం, తెలంగాణ బ్యూరో : పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రాసెస్ ముగిసిపోవడంతో ఇకపైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ (MPTC, ZPTC) ఎన్నికలను నిర్వహించేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. పండగలు, పరీక్షలు, బడ్జెట్ సమావేశాలు.. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుందనే అంశంపై మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. మున్సిపాలిటీలకు చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ల ఎన్నిక ఎల్లుండి జరగనున్నందున ఎక్కడెక్కడ పార్టీకి ఎలాంటి ఇబ్బందులున్నాయో కూడా ఆరా తీశారు. స్వతంత్ర అభ్యర్థులు, రెబల్ క్యాండిడేట్స్ నుంచి మద్దతు పొందడంపైనా చర్చించినట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ ఏయే ఎంపీ సెగ్మెంట్లో ఎలాంటి అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో కూడా చర్చించినట్లు సమాచారం. గంటకు పైగా జరిగిన సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
రైతుభరోసా నిధుల విడుదలపైనా చర్చ :
యాసంగి పంట సీజన్ ఇప్పటికే ప్రారంభమైనందున తొందర్లోనే రైతుభరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేయడంపై మంత్రులతో సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) చర్చించారు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వాలనుకున్నందున జియో మ్యాపింగ్, శాటిలైట్ ఇమేజింగ్ ప్రక్రియల ద్వారా సాగుభూములను ప్రభుత్వం గుర్తించింది. సుమారు రూ. 7 వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. త్వరలోనే ఈ నిధులను విడుదల చేయడంపై సూత్రప్రాయంగా నిర్ణయం జరిగినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం కాకపోయినా అందుబాటులో ఉన్న మంత్రులతో ఇన్ఫార్మల్ సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేకపోయారు. త్వరలో జరగాల్సిన బడ్జెట్ సమావేశాల గురించి కూడా ప్రాథమిక స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం.
Read Also: ఫార్ములా కార్ రేస్ కేసులో కొత్త ట్విస్ట్
Follow Us On : WhatsApp


