కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ కార్పొరేషన్ (Karimnagar Corporation) వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. స్థానికంగా అత్యధిక స్థానాలు బీజేపీ దక్కించుకున్నప్పటికీ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడటం చర్చకు తెరలేపింది. ఈ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 స్థానాలు ఉండగా 30 డివిజన్లలో బీజేపీ, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. మ్యాజిక్ ఫిగర్ 34 కాగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. మరోవైపు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల్లో గెలుపొందిన 8 స్వతంత్రుల్లో నలుగురు తమ పార్టీలో చేరారని, మేయర్ పీఠం బీజేపీదేనని పార్టీ నేతలతో చెప్తున్నట్లు సమాచారం. గెలిచిన ఇతర పార్టీ అభ్యర్థులు కూడా ఫోన్ చేసి సహకరిస్తామని చెబుతున్నారని బండి సంజయ్ మీడియాతో చెప్పారు. ఇంకో వైపు కాంగ్రెస్ సైతం పక్క పార్టీ అభ్యర్థులను చేర్చుకొని ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎంఐఎం, బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్‌కు మద్దతిస్తారా లేదా? ఇతర పార్టీల అభ్యర్థులను తమ పార్టీలో చేర్చుకోవడంలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ అవుతారా అన్నది వేచి చూడాలి.


