కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) లో ఫలితాలు వెలువడినా నరాలు తెగే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. నిజామాబాద్ నగరపాలక సంస్థలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో బీజేపీ 28 స్థానాలు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించి. కాంగ్రెస్ 17 స్థానాలు కైవసం చేసుకుంది. ఎంఐఎం 14 డివిజన్లలో గెలిచింది. బీఆర్ఎస్ మాత్రం 01 సీటుతో సరిపెట్టుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 31 మైలురాయిని మాత్రం ఏ పార్టీ చేరుకోలేకపోయింది. బీజేపీ పోయిన ఎన్నికలో కూడా 28 సీట్లు సాధించింది. కానీ రెండుసార్లు బీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు పెట్టుకుని మేయర్ సీటును కారు ఖాతాలో వేసుకుంది.
ఈసారి బీజేపీ 30కి పైగా స్థానాలు సాధించే లక్ష్యంతో ఎన్నికలను సవాల్ గా తీసుకుంది. గతంలో సాదించిన స్థానాలను పదిలపరచుకుంది. కేవలం రెండే స్థానాలు సాధించిన కాంగ్రెస్ మాత్రం ఈసారి 17 కు పుంజుకుంది. రెండు సార్లు 16 స్థానాలు సాధించిన ఎంఐఎం ఈసారి రెండు స్థానాలు తగ్గి 14కు చేరింది. బీజేపీకి ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఎంపీ అరవింద్, నిజామాబాద్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి లతో పాటు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇటు కాంగ్రెస్ కు కూడా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇద్దరికి ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి.
వారితో పాటు ఎంఐఎం ఆపన్నహస్తం అందిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా చక్రం తిప్పి మేయర్ స్థానం కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఒక్క స్థానం సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎటువైపు మద్దతు ఇస్తుందోననేది కూడా ఆసక్తికరంగా మారింది.. ఇప్పటికే పార్టీలు తమ కార్పొరేటర్ల ను క్యాంపునకు తరలించాయి. ఈ నేపథ్యంలో నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఎవరి లెక్కలు వారివే.. వ్యూహ ప్రతి వ్యూహాలలో ఆయా పార్టీలు నిమగ్నం అయిపోయాయి.


