epaper
Wednesday, February 18, 2026
epaper

పట్టణ ఓటర్లూ కాంగ్రెస్ వైపే.. సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ, బీఆర్ఎస్ పోటీ

కలం, తెలంగాణ బ్యూరో : పంచాయతీ ఎన్నికల తరహాలోనే పట్టణ ఓటర్లు సైతం అధికార పార్టీకే జైకొట్టారు. మెజారిటీ మున్సిపాలిటీలను, వాటిల్లోని వార్డులను ఆ పార్టీ గెల్చుకున్నది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 74, బీఆర్ఎస్ 17, బీజేపీ 1 చొప్పున గెలిచాయి. మిగిలిన మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి నెలకొన్నది. ఎన్నికలు జరిగిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగు చోట్ల కాంగ్రెస్, ఒక చోట బీజేపీ గెలవగా మిగిలిన రెండు చోట్ల హంగ్ నెలకొన్నది. వార్డులవారీగా చూస్తే ఫస్ట్ ప్లేస్‌లో కాంగ్రెస్ ఉంటే సెకండ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఓట్ల శాతం రూపంలో చూసినా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య చాలా వ్యత్యాసమున్నది. బీఆర్ఎస్‌కు గట్టి పట్టు ఉన్నట్లు చెప్పుకునేచోట కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో ఆ పార్టీ అభ్యర్థులు గెలవలేదు.

కేసీఆర్ గజ్వేల్ కోటకు బీటలు :

ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలోని 20 స్థానాల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా బీఆర్ఎస్ 11 చోట్ల మాత్రమే గెలిచి పరువు నిలబెట్టుకున్నది. గత ఎన్నికల సందర్భంగా ఒక్క వార్డుకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి 7 చోట్ల గెలిచింది. పదేండ్ల కాలంలో గజ్వేల్‌కు ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేసి అభివృద్ధి చేసినట్లు చెప్పుకున్నా ప్రజలు ఆదరించలేదు. “కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారు… మా ఎమ్మెల్యే కనిపించడంలేదు… ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతల్లో విఫలం.. అసెంబ్లీకి హాజరు కాని ఆయనకు జీతం ఎందుకు?… సమస్యలను పరిష్కరించడానికి ఆయన బయటకు రారు.. మేం ఫామ్ హౌజ్‌కు వెళ్లలేం..” ఇలాంటి నిరసనలు గడచిన రెండేండ్లలో స్థానిక ప్రజల నుంచి వ్యక్తమయ్యాయి. అది ఇప్పుడు ఓట్ల రూపంలో రిఫ్లెక్ట్ అయింది. సంఖ్యాపరంగా గెలిచినా నైతికంగా ఓడారన్న మాటలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

సిద్దిపేట్, సిరిసిల్ల జిల్లాల్లో కాస్త బెటర్ :

హరీశ్‌రావు చొరవ తీసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్, దుబ్బాక, మెదక్, తూప్రాన్, గడ్డపోతారం, చేర్యాల, గుమ్మడిదల, ఇస్నాపూర్, ఇంద్రేశం, జహీరాబాద్, జిన్నారం తదితర మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను గెల్చుకున్నది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ ఆ జిల్లా పరిధిలోని వేములవాడలో మాత్రం కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఓడిపోయింది. గతంలో మంత్రులుగా పనిచేసిన నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో సైతం బీఆర్ఎస్ ఓడిపోయింది. అంచనాకు అందని తీరులో మహబూబ్‌నగర్ జిల్లాలో ఐజ, నల్లగొండ జిల్లాలో తిరుమలగిరి తదితర చోట్ల మాత్రం గెలిచింది. ఇక వార్డువారీగా చూస్తే దాదాపు 700 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా ఇరవై మున్సిపాలిటీలను సైతం గెల్చుకోలేకపోవడం ఆ పార్టీ కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేసింది.

తగ్గిపోయిన కేటీఆర్ పర్‌ఫార్మెన్స్ :

మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ ప్రచారం చేసిన అన్ని చోట్లా దాదాపుగా బీఆర్ఎస్ ఓడిపోయింది. సొంత సెగ్మెంట్ అయిన సిరిసిల్లలో మాత్రమే గెలుపొందింది. ఆ జిల్లా పరిధిలోని వేములవాడలో సైతం బీఆర్ఎస్‌ను కేటీఆర్ గెలిపించుకోలేకపోయారు. ఆయన రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించిన సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ, తాండూరు, రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితర అన్ని చోట్లా బీఆర్ఎస్‌ ఓడిపోయింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ పనితీరు పేలవంగా ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్న అభిప్రాయాలు ఆ పార్టీ కేడర్‌ నుంచి వ్యక్తమవుతున్నాయి. హరీశ్‌రావు ప్రచారం చేసిన చోట, ఉమ్మడి మెదక్ జిల్లాలో గణనీయమైన విజయాలు సాధించిన కేటీఆర్ విషయంలో మాత్రం బెడిసికొట్టాయన్నది శ్రేణుల అభిప్రాయం.

మంత్రుల జిల్లాల్లో కాంగ్రెస్ విజయం :

ముఖ్యమంత్రి సహా మంత్రుల సొంత జిల్లాలు, ఇన్‌చార్జిలుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ మున్సిపాలిటీలనే గెల్చుకున్నది. పోలింగ్ పూర్తయ్యేంతవరకూ జిల్లాలను దాటి రావద్దంటూ సీఎం, పీసీసీ చీఫ్, పార్టీ ఇన్‌చార్జి ఆదేశాలు జారీచేయడంతో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలే వచ్చాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పరిగణనలోకి తీసుకుంటే అత్యధికంగా గెల్చుకున్నా వార్డు సభ్యుల సంఖ్యను గమనంలోకి తీసుకుంటే మాత్రం బీఆర్ఎస్ దూకుడును అరికట్టడంలో కాంగ్రెస్ విఫలమైంది. మొత్తం 2,581 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 1,350 మంది, బీఆర్ఎస్ అభ్యర్థులు 720 మంది, బీజేపీ అభ్యర్థులు 260 మంది చొప్పున గెలిచారు. మంచిర్యాల జిల్లాలో క్యాతనపల్లి, బెల్లంపల్లి, మహబూబాబాద్ మున్సిపాలిటీ, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం తదితర చోట్ల కాంగ్రెస్‌కు పట్టు ఉన్నా బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయింది. ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉన్నచోట్ల కూడా కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలే వచ్చాయి.

Read Also: 27 వేల అడుగుల ఎత్తులో పేలిన విమాన ఇంజిన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>