కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీని అందించిన రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనకు లభించిన సంపూర్ణ ఆమోదమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
ఈ గెలుపు వెనుక లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల అలుపెరుగని శ్రమ దాగి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్టీ జెండాను భుజాలు కాయలు కాసేలా మోసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు పార్టీ పట్ల కనబరిచిన అభిమానానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన తెలిపారు.
గడిచిన రెండేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, అభివృద్ధి కార్యాచరణకు ప్రజలు ఈ తీర్పు ద్వారా మద్దతు తెలిపారని సీఎం వివరించారు. ఈ విజయం ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. పారదర్శక పాలనతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు.
Read Also: ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో హస్తం హవా
Follow Us On: Pinterest


