కలం, మెదక్ బ్యూరో : నాలుగు రోజుల క్రితం ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచిన భారీ మద్యం, నిత్యావసర సరుకులతో పోలీసులకు పట్టుబడ్డారు. సీన్ కట్ చేస్తే పంచుతూ పట్టుబడిన వారే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా భారీ మెజార్టీతో విజయం సాధించారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా గజ్వెల్ (Gajwel Municipality) పట్టణంలో 2వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి గోలి మమత – సంతోష్ ఎన్నికల్లో విజయం కోసం తన వార్డు ఓటర్ల కోసం మందు, చిప్స్ పాకెట్స్, మందు తాగని వారి కోసం కూల్ డ్రింక్స్, మహిళా ఓట్లు కూడా కీలకం గనుక వారి కోసం నిత్యవసర సరుకులైన సబ్బులు, సర్ఫ్ పాకెట్స్, ఫ్లోర్, బాత్ రూం క్లీనింగ్ లిక్విడ్స్.. ఇలా ఒక పద్ధతి ప్రకారం సంచిలో పెట్టీ పంచడానికి సిద్ధం చేశారు.
ఈ క్రమంలో పంచడానికి సిద్ధంగా ఉంచిన భారీ మద్యం, నిత్యావసర సరుకులను ఈ నెల 8వ తేదీన ఎఫ్ఎస్టీ పోలీసులు సీజ్ చేశారు. అయినా, ఓటర్ల ను ప్రలభపెట్టడానికి ప్రయత్నం చేసినా గోలి మమత సంతోష్ విజయం సాధించారు. గెలిచింది అనామకుడి మీద కాదు.. గజ్వేల్ మున్సిపాలిటీ (Gajwel Municipality) మాజీ చైర్మన్ భాస్కర్ భార్య కళ్యాణి పైన.. 529 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించి సంచలనం సృష్టించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు సామాన్ల సంచులు తమకు దక్కకుండా చేశారనే కోపంతోనో లేక మన కోసమే పోలీసులకు పట్టుబడి, కేసుల పాలయ్యారనే సానుభూతో… మొత్తానికి గోలి మమత గెలుపు టాక్ ఆఫ్ గజ్వేల్ గా మారింది.


