కలం, స్పోర్ట్స్: నమీబియాపై భారత్ 93 పరుగులతో గెలిచినప్పటికీ బౌలర్ల వినియోగంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Srikkanth) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) అనుసరించిన వ్యూహాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నమీబియా 67/1 స్కోరుతో దూకుడుగా ఉన్న సమయంలో వరుణ్ చక్రవర్తి రెండు ఓవర్లలో 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ మలుపు తిప్పారు.
అద్భుత ఫామ్‌లో ఉన్న అతనితో పూర్తి ఓవర్లు చేయించకపోవడం అన్యాయమని శ్రీకాంత్ మండిపడ్డారు. వరుణ్‌ను దాచిపెట్టాలనే ఆలోచన అర్థరహితమని విమర్శించారు. అతనికి వరల్డ్ కప్‌లో ఐదు వికెట్లు తీసే సువర్ణావకాశాన్ని మేనేజ్‌మెంట్ చెడగొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ తన కోటా పూర్తి చేసి ఉంటే నమీబియా ఇన్నింగ్స్ ఎప్పుడో ముగిసేదని అభిప్రాయపడ్డారు.
జస్ప్రీత్ బుమ్రాను పవర్‌ప్లేలో బౌలింగ్‌కు దించకపోవడాన్ని కూడా శ్రీకాంత్ ఆక్షేపించారు. ప్రత్యర్థి జట్టు పవర్‌ప్లేలో 57 పరుగులు చేస్తున్నా ఏడో ఓవర్ వరకు బుమ్రాను తీసుకురాకపోవడం వెనుక లాజిక్ ఏంటని ప్రశ్నించారు. బుమ్రా ఏమైనా సామాన్య బౌలరా అని నిలదీస్తూ అతడిని కూడా గదిలో పెట్టి దాస్తారా అని ఎద్దేవా చేశారు. బుమ్రాతో బౌలింగ్ ప్రారంభించి ఉంటే మ్యాచ్ ఫలితం అప్పుడే తేలిపోయేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ గెలుపులో బౌలర్ల వ్యక్తిగత ప్రతిభ ఉన్నప్పటికీ నాయకత్వ (Suryakumar Yadav) నిర్ణయాలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి.
Read Also: పాక్ మ్యాచ్‌కు ముందు అభిషేక్ శర్మ హెల్త్ అప్డేట్!
Follow Us On: Youtube


