epaper
Wednesday, February 18, 2026
epaper

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ‘హంగ్’ టెన్షన్

కలం, నల్లగొండ బ్యూరో : ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత రాకుండా హంగ్ నెలకొన్న మున్సిపాలిటీల్లో కొత్త టెన్షన్ నెలకొన్నది. మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వెల్లడైన ఫలితాల్లో (Municipal Poll Results) మొత్తం 116 మున్సిపాలిటీల్లో పలుచోట్ల హంగ్ నెలకొన్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్, అమరచింత, దేవరకద్ర, ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొహిర్, జహీరాబాద్, ఇస్నాంపూర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కేసముద్రం, జనగాం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, జిన్నారం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్‌కు సరిపోయేంత స్థానాలు ఏ పార్టీకీ రాలేదు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ తరహా వాతావరణం నెలకొన్నది. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు అనివార్యం కానున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక సమయంలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. వారు ఎటువైపు ఓటు వేస్తారన్నది ఆసక్తికరం.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష :

హంగ్ పరిస్థితి నెలకొన్న మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష ఎదురుకానున్నది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నది. ఎమ్మెల్యేలలో కొందరు టెక్నికల్‌గా బీఆర్ఎస్‌కు చెందినవారుగానే ఉన్నారు. దీంతో ఒటింగ్ సమయంలో వారికి పార్టీ నాయకత్వం ‘విప్’ (Whip) జారీ చేయనున్నది. ఆ ప్రకారం వారు ఓటు వేయక తప్పదు. ఆ నిబంధనతో బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. విప్‌ను ధిక్కరిస్తే వారు అనర్హత వేటుకు గురికావాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్నందున బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో అనుకూల ప్రతికూల ఓటింగ్‌లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ముందు నుయ్యి.. వెనక గొయ్యి తరహా వాతావరణం నెలకొన్నది.

జంపింగ్ కార్పొరేటర్లు, స్వతంత్రులపై ఆశలు :

పలు మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొన్న నేపథ్యంలో మునిసిపల్ చైర్‌పర్సన్ పోస్టు దక్కించుకోడానికి పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కార్పొరేటర్లను ఆకట్టుకోడానికి ఒక పార్టీ, చేజారకుండా చూసుకునేలా మరో పార్టీ వాటి వంతు ప్రయత్నిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. ఒకవైపు ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్పొరేటర్లను ఆకర్షించడం, మరోవైపు స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నవారిని తమవైపు తిప్పుకోవడంపై పార్టీలు దృష్టి సారించాయి. ఎక్స్ అఫీషియో సభ్యులల్లో ఎమ్మెల్యేలకు ‘విప్’ చిక్కులు ఉన్నందున ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. ఓటింగ్‌కు గైర్హాజరు మొదలు ఆపరేషన్ ఆకర్ష్, క్యాంపు పాలిటిక్స్ పై పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.

Read Also: సూర్యాపేట జిల్లాలో చేజారిన తిరుమలగిరి.. బీఆర్ఎస్ విజయం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>