Mobile Popup Ad
Mobile Popup Ad

కులానికి బహిష్కరణ.. ఓ పల్లెటూరు ఆదర్శ తీర్మానం

కలం, వెబ్​డెస్క్: సమాజాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తున్న రోగాల్లో కులం ఒకటి. ఈ టెక్నాలజీ యుగంలోనూ కులం కారణంగా ఊరు, సంఘం, తెగ నుంచి ఎంతో మంది బహిష్కరణకు గురవుతున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటికి తమ ఊర్లో తావు లేదంటూ ఏకంగా కులాన్నే గ్రామం నుంచి బహిష్కరించింది ఓ పల్లెటూరు. ఆ ఆదర్శ గ్రామం సౌండాల (Saundala Village). మహారాష్ట్రలోని అహిల్యానగర్​ జిల్లా నేవాసా తాలూకాలో ఉంది.

పంచాయతీ తీర్మానం..

గ్రామంలో కులవివక్ష, అంటరానితనం, సామాజిక అంతరం తొలగించేందుకు ఇటీవల సర్పంచ్​ అధ్యక్షతన గ్రామ పంచాయతీ సమావేశమైంది. రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి సూత్రాల ఆధారంగా మానవతా సమాజాన్ని నిర్మించాలని భావించింది.

గ్రామంలో కులం, మతం, వంశం, సంప్రదాయం ఆధారంగా ఎలాంటి వివక్ష ఉండకూడదని, ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. దీన్ని సర్పంచ్​ శరద్​ బాబూరావు అరగడే ప్రతిపాదించగా, బాబాసాహెబ్ మచ్చీంద్ర బోధక్ మద్దతు తెలిపారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే, రాజర్షి సాహూ మహారాజ్​, మహాత్మా గాంధీ ఆశయాల ప్రేరణతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు.

అన్నింట్లో మానవత్వమే కులం..

తీర్మానం ప్రకారం అందరి కులం మానవత్వమే అనే భావనను గ్రామస్థులు స్వీకరించారు. ప్రభుత్వ సేవలు, నీటి వనరులు, గుడులు, శ్మశానాలు, పాఠశాలలు, సామాజిక కార్యక్రమాలు సహా అన్ని ప్రజా స్థలాలు వివక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

అంటరానితనం, సామాజిక బహిష్కరణ లేదా సామాజిక అన్యాయానికి దారితీసేలా ఎవరూ మాట్లాడవద్దని, సోషల్​ మీడియాలోనూ అలాంటి కంటెంట్‌ను ప్రచారం చేయకూడదని గ్రామసభ నిర్ణయించింది (Saundala Village). ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

గ్రామీణ ప్రాంతాల్లో కులవివక్ష అనే విషం బలంగా ఉందని, అది తమ గ్రామానికి చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ అరగడే పేర్కొన్నారు. అంటరానితనం తరిమేస్తామన్నారు. కులవివక్షకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులపైనా నిఘా ఉంచి, ఫిర్యాదులు వచ్చినా లేదా స్వయంగా గుర్తించినా చర్యలు తీసుకుంటామన్నారు.

‘గ్రామంలో కులవివక్షను పూర్తిగా తొలగించి, ఐక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ తీర్మానం తెచ్చాం. కులంతో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పిస్తాం. అందరం ఒకటే అనే భావన కలిగిస్తాం. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తాం’ అని సర్పంచ్​ వెల్లడించారు.

Read Also: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు నిజామాబాద్ క్రీడాకారులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>