కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన మక్తల్ (Makthal) బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య (BJP Candidate Suicide) కేసు కీలక మలుపు తిరిగింది. తన భర్త ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని మహదేవప్ప భార్య సత్తెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు ఒక్క రోజు ముందు మక్తల్‌లోని 8వ వార్డులో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప (Mahadevappa) ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ వార్డులో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటన జరిగినప్పుడు కొన్ని రోజులుగా తన భర్త తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని, తన భర్తకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని మహదేవప్ప భార్య మీడియాకు తెలిపింది. గెలిచినా, ఓడినా తనకు కష్టాలే ఉన్నాయని చెప్పినట్లు వెల్లడించింది.
ఫోన్లలో బెదిరింపులు వచ్చాయని కూడా తెలిపింది. దీనిపై బీజేపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య అని మండిపడ్డారు. పోలీసులు ఎఫ్ఐఆర్ మార్చేశారని ఆరోపించారు. మరోవైపు తన భర్త ఓటమి భయంతో క్షణికావేశంలో ఆత్మహత్య (BJP Candidate Suicide) చేసుకున్నట్లు మహదేవప్ప భార్య సత్తెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త మృతిపై తనకు ఎలాంటి అనుమానం లేదని సత్తెమ్మ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సత్తెమ్మ ఫిర్యాదుతో ఈ ఘటన ఇంతటితో ముగుస్తుందా? లేక మళ్లీ బీజేపీ నేతల జోక్యంతో ఏమైనా జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: జగదీశ్ రెడ్డి
Follow Us On: Instagram


