కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (Telangana Chief Secretary) తదుపరి అధికారి ఎవరవుతారనే ఊహాగానాలు గత కొన్ని రోజులుగా సచివాలయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు (CS Ramakrishna Rao) పదవీకాలం మార్చి 31తో ముగుస్తున్నది. ఇప్పటికే ఒకసారి ఎక్స్ టెన్షన్ వచ్చినందున మరోసారి అవకాశం రాకపోవచ్చని ప్రభుత్వ వర్గాలే స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాయి. దీంతో కొత్త సీఎస్ అవకాశం ఎవరికనేది ఉత్కంఠగా మారింది. ఇంకా ఒకటిన్నర నెల రోజుల సమయం ఉన్నా ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఒకే బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులున్న వారిలో వికాస్‌రాజ్ (Vikas Raj IAS) పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. జయేశ్ రంజన్ పేరు తొలినాళ్ళలో వినిపించినా తాజాగా జరిగిన ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీతో ఆయనకు సీఎస్ అవకాశం రాకపోవచ్చన్నది పలువురు అధికారుల అభిప్రాయం.
జయేశ్‌రంజన్‌కు అవకాశాలు తక్కువేనా? :
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఇండస్ట్రీస్, ఐటీ శాఖల బాధ్యతలు చూసిన జయేశ్‌రంజన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కొంతకాలం అవే బాధ్యతల్లో ఉన్నారు. రెండుసార్లు దావోస్ సమ్మిట్ (2024, 2025)కు ఆయనే కీలక భూమిక పోషించారు. పరిశ్రమల శాఖలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ఆయనను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. సీఎంఓలో అవే శాఖల పర్యవేక్షణా బాధ్యతలను అప్పజెప్పింది. గ్లోబల్ సమ్మిట్ తదనంతర పరిస్థితుల్లో ఆయనను సీఎంఓ నుంచి బైటకు పంపి పురపాలక శాఖ స్పెషల్ సీఎస్‌గా (హెచ్ఎండీఏ పరిధికి లోబడి) నియమించింది. తాజాగా బుధవారం జరిగిన బదిలీల్లో ఆయనను జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. కొన్ని గంటల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా విడిపోవడంతో వాటన్నింటికీ ఆయన స్పెషల్ ఆఫీసర్‌గా కొనసాగనున్నారు. దీంతో ఆయనకు సీఎస్ అవకాశాలు తక్కువేనన్నది సచివాలయ వర్గాల భావన.
రేసులో సీనియర్ ఐఏఎస్ వికాస్‌రాజ్ :
చీఫ్ సెక్రటరీ పోస్టుకు ముగ్గురు సీనియర్ అధికారులు ఉన్నా జయేశ్‌రంజన్ (Jayesh Ranjan) తాజా బదిలీతో ఆయనకు ఆ ఛాన్స్ లేదనే బలమైన అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీంతో ఇక మిగిలింది 1992 బ్యాచ్ అధికారులు వికాస్‌రాజ్ (Vikas Raj IAS), సంజయ్ జాజు (Sanjay Jaju). వికాస్‌రాజ్ రిటైర్‌మెంట్‌కు దాదాపు ఏడాదిన్నర కాలమున్నది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు రిటైర్‌మెంట్‌కు రెండేండ్ల గడువున్నది. ముగ్గురు సీనియర్ ఆఫీసర్లలో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. సబ్యసాచి ఘోష్‌కు ప్రభుత్వం ఎక్కువ బాధ్యతలు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తున్న సచివాలయ వర్గాలు 1994 బ్యాచ్‌కు చెందినవారైనందున ఆయనకు సీఎస్ అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. బడ్జెట్ సమావేశాల తర్వాతే కొత్త సీఎస్ ఎంపికపై ప్రభుత్వం దృష్టి సారించనున్నది.
Read Also: కరీంనగర్‌లో ‘పొత్తు’ పొడుపు – కమలం, గులాబీ స్నేహం ?
Follow Us On : WhatsApp


