కలం, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్’ కేసులో ప్రధాన నిందితుడైన ఎప్స్టీన్ను తాను కలిసినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు (Hardeep Singh Puri). బుధవారం లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘ఎప్స్టీన్ ఫైల్స్’ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ ఫైల్స్‌లో అదానీ, అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పూరి పేర్లు ఉన్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఈ క్రమంలో హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. తాను ఇంటర్నేషనల్ పీస్ ఇనిస్టిట్యూట్(ఐపీఐ) బృందంలో భాగంగా ఎప్స్టీన్ను కలిసినట్లు వెల్లడించారు. ‘ఐపీఐలో మా టీమ్ లీడర్‌కు ఎప్స్టీన్ తెలుసు. అందువల్ల కొన్ని సార్లు కలవాల్సి వచ్చింది. కచ్చితంగా చెప్పాలంటే మూడు, నాలుగు సార్లు మాత్రమే కలిశా. ఒక్కసారి ఈమెయిల్ చేసుకున్నాం. అయితే, అతడి సెక్స్ స్కాండల్ కుంభకోణానికి మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని హర్దీప్ స్పష్టం చేశారు. అయితే, సభలో రాహుల్ ఆరోపించినవన్నీ అవాస్తవమన్నారు.
‘లోక్‌సభలో ఈరోజు రాహుల్ కొన్ని విషయాలు మాట్లాడారు. అయితే, అవన్నీ పూర్తి నిరాధారం. మన రాజకీయ వ్యవస్థలో రెండు రకాల నాయకులు ఉంటారు. ఒకరు బాధ్యతగా ప్రవర్తిస్తారు. మరికొందరు అప్పుడప్పుడూ సభకు వస్తూ ఆరోపణలు చేస్తారు. వాటికి సమాధానాలు వినకుండా వాకౌట్ చేస్తారు’ అంటూ రాహుల్‌ను ఉద్దేశించి హర్దీప్ (Hardeep Singh Puri) వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


