కలం, వెబ్‌డెస్క్: టెక్ ప్రపంచంలో మరో కలకలం. ఇటీవలే క్లాడ్ ఏఐతో సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఉలికిపడేలా చేసిన ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ సేఫ్టీ రీసెర్చర్ మృణాంక్ శర్మ (Mrinank Sharma) రాజీనామా చేశారు. అంతేకాదు, సంస్థ నుంచి తాను బయటపడడానికి గల కారణాలను వివరిస్తూ ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరలవుతూ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రపంచ సంక్షోభాల్లో ఏఐ ఒకటి..
సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో మృణాంక్ నర్మగర్భంగా ఏఐ వ్యాఖ్యలు చేయడం అనేక చర్చలకు తావిస్తోంది. తాను ఎందుకు ఈ రంగాన్ని విడిచిపెడుతున్నానో అందులో అన్యాపదేశంగా వెల్లడించారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటోందని, వాటిలో AI ఒకటే కాదని ఆయన పేర్కొనడం దీనికి ఉదాహరణ.
‘జీవాయుధాలు, ప్రపంచ రాజకీయాలు, వేగంగా మారుతున్న సాంకేతికత..ఇవన్నీ కలసి మానవాళిపై భారం పెడుతున్నాయి. ప్రపంచం ప్రమాదకర దశలో ఉంది. మన శక్తి ఎంత వేగంగా పెరుగుతోందో, అంతే వేగంగా మన జ్ఞానం కూడా పెరగాల్సిన అవసరం ఉంది’ అని ఆయన తన పోస్టులో రాశారు.
చెప్పడం సులభం.. పాటించడం కష్టం..
తన సహచరులకు ఉద్దేశిస్తూ పంపిన రాజీనామా లేఖలో కంపెనీలో ఉన్న అంతర్గత లోటుపాట్లను, ఘర్షణలను శర్మ (Mrinank Sharma) ప్రస్తావించారు. విలువలు, భద్రత గురించి బహిరంగంగా మాట్లాడినా, వాస్తవంగా వాటిని పాటించడం ఎంత కష్టమో ప్రత్యక్షంగా చూసినట్లు అందులో పేర్కొన్నారు.
ఇప్పటివరకూ ఏఐపై ప్రజల్లో, ముఖ్యంగా టెకీల్లో అనేక భయాలు వ్యక్తమవుతుండగా, ఇప్పుడు ఆంథ్రోపిక్‌లో పనిచేసిన కీలక అధికారి నుంచి ఇలాంటి హెచ్చరిక రావడం కుదిపేస్తోంది. ఇప్పటివరకు AIపై ఆందోళనలు వ్యక్తం చేసింది బయటివాళ్లే కాగా, ఇప్పుడు సంస్థలో నుంచే అలారం మోగడం పరిస్థితిని చెబుతోంది. మృణాంక్ శర్మ రాజీనామా వ్యవహారం 2020లో గూగుల్‌ను వీడిన డా. టిమ్నిట్ గెబ్రు ఘటనను గుర్తుకు తెస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
ఆంథ్రోపిక్‌లో మృణాంక్ పని ఏంటంటే..
మృణాంక్ శర్మ 2023లో ఆంథ్రోపిక్ (Anthropic) లోని ఏఐ భద్రత బృందంలో చేరారు. అత్యాధునిక ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, నియంత్రణలో ఉండేలా చూసే బాధ్యత ఆయనది. ఇటీవల సంస్థ తెచ్చిన ‘క్లాడ్’ టెక్నాలజీలోనూ ఆయన పాత్ర కీలకం. గూగుల్ జెమిని, చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ ఏఐలా కాకుండా ఇది అచ్చంగా ఉద్యోగిలా పనిచేస్తుందని, ఇకపై సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గుతుందని ఆంథ్రోపిక్ సీఈవో డారియో ఇటీవల వెల్లడించారు. ఈ క్రమంలో ఆ సంస్థ ఉద్యోగి ఆకస్మికంగా వైదొలగడం టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
Read Also: ట్రోల్స్‌పై అల్లు అర్జున్ టీమ్ స్ట్రాంగ్ రియాక్షన్
Follow Us On: Sharechat


