కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాగృతి చీఫ్ కవిత (Kavitha) సవాల్ విసిరారు. రుణమాఫీ వందశాతం ఎక్కడ అమలు చేశారని కవిత ప్రశ్నించారు. ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని పేర్కొన్నారు. రుణమాఫీ అమలు తీరుపై తాను ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని కవిత పేర్కొన్నారు. తన సొంత జిల్లా నిజామాబాద్‌లోనైనా, ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరులోనైనా, సెక్రటేరియట్‌లోనైనా ముఖ్యమంత్రితో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. రైతులతో కలిసి మొత్తం డాటా తీసుకొని తాను చర్చకు వస్తానని కవిత పేర్కొన్నారు. మంగళవారం కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 20 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు.. పెన్షన్‌ను డబుల్ చేస్తామన్న హామీ మేరకు 35 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్లపై ..
గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. గ్రామాల్లో నాలుగు లక్షల ఇండ్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది. కానీ పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం నిధులను కేటాయించాలని కోరారు. 8 లక్షల ఇండ్లకు 25 వేల కోట్లను బడ్జెట్ లో పెట్టాలని సూచించారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం హామీ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒక్కో అమరవీరుల కుటుంబానికి నెలకు 25 వేల ఆర్థిక సాయం హామీని కూడా నెరవేర్చాలన్నారు. ‘ఆటో డ్రైవర్లకు రూ. 12,500 నెలకు ఇస్తామన్న హామీకి నిధుల్ని కేటాయించాలి. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రూ. 500 ఇస్తే కేంద్రం నుంచి రూ. 5,500 చొప్పున వస్తాయి. చేవెళ్ళ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకారం హామీల అమలుకు నిధుల్ని కేటాయించాలి.’ అంటూ కవిత డిమాండ్ చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఎంఎస్‌పీ అమలు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాను కౌలు రైతులకూ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇద్దరికీ కలిపి పెట్టాలంటే 25 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. రైతుభరోసాకు రూ. 10 వేల కోట్లను ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు రైతుభరోసా రైతులకు అందలేదని.. వెంటనే విడుదల చేయాలని కవిత (Kavitha) కోరారు.
రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలైందా?
‘రుణమాఫీని 100% అమలు చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. తొలుత 45 వేల కోట్లు అవసరమని చెప్పారు. ఇచ్చింది 21 వేల కోట్లే. క్యాబినెట్ మాత్రం 28 వేల కోట్లకు ఆమోదం తెలిపింది. సీఎంకు నా సవాల్… మహబూబ్‌నగర్ లేదా నిజామాబాద్ లేదా సచివాలయంలో చర్చ పెడితే బాధిత రైతుల్ని తీసుకొచ్చి మాట్లాడిస్తాం. ఇంకా 50% మందికి మాఫీ కాలేదు. రైతుల్ని మోసం చేయొద్దు. యూరియా కూడా అందక ఇబ్బంది పడుతున్నారు. సీఎం ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. స్టూడెంట్స్ ఫీజు రీఇంబర్స్ మెంట్ బకాయిలు రూ. 11 వేల కోట్లు పేరుకుపోయాయి. దీంతో ఆడపిల్లలకు బాధలు ఉన్నాయి. చదువు ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా నిధుల విడుదలపై క్యాలెండర్‌ను ప్రకటించాలి. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎ, అబద్ధం చెప్పారు. 50 వేల మంది ఉన్నారని చెప్పారు. ఇప్పుడు 32 వేల మంది మాత్రమే ఉన్నారు. బలవంతంగా ఉద్యోగులను మాన్పించింది. ఒక బస్సులో 170 మంది ప్రయాణించినందుకు జగిత్యాలలో ఒక కండక్టర్‌ను సస్పెండ్ చేసింది యాజమాన్యం. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను పెడుతున్నది. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ’ అంటూ కవిత పేర్కొన్నారు.
మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న హామీ గాలికి పోయింది. ఆడపిల్లలకు తులం బంగారం, స్కూటీ ప్రామిస్‌లు కూడా బుట్టదాఖలా అయ్యాయి. ఈ బడ్జెట్‌లో వీటికి నిధులు పెట్టాలి. ఉద్యోగాల్లో యువతకు అన్యాయం జరుగుతున్నది. తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ పాత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు పత్రాలు ఇస్తున్నది. స్వతహాగా ఇచ్చి 11 వేలు మాత్రమే ఇంకా 1.89 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నది. వారిని రిక్రూట్ చేస్తే జీతాల కోసం ఎంత చెల్లించాల్సి ఉంటుందో అంతే మొత్తాన్ని బడ్జెట్‌లో పెట్టాలి. క్యాలెండర్ ప్రకటించాలి. బీఆర్ఎస్‌ను నిందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాలి. డిప్యూటీ సీఎంను కలిసి జాగృతి ప్రతిపాదనలను రాతపూర్వకంగా సమర్పిస్తాం.’ అంటూ కవిత పేర్కొననారు.
కేంద్ర నిర్ణయాలపై ముఖ్యమంత్రి మౌనమెందుకు?
‘కేంద్రం తీసుకునే నిర్ణయం రాష్ట్రం మీద పడుతున్నప్పుడు సీఎం స్పందించాలి. కానీ స్పందించలేదు. 12న లేబర్ కోడ్ విధానానికి వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేపడుతున్నారు. దానికి జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తున్నది.’ అంటూ కవిత పేర్కొన్నారు. సీఎం హోదాలో లేబర్ కోడ్ చట్టాలను వ్యతిరేకించాలన్నది జాగృతి డిమాండ్ అని కవిత పేర్కొన్నారు. ‘జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టకపోతే సీఎం ఇప్పటికీ స్పందించలేదు. 42% రిజర్వేషన్ బిల్లు పెట్టి గొప్పగా చెప్పుకుని ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. దీనిపైన రాష్ట్ర ప్ఱభుత్వ వైఖరిపై కేంద్రానికి లేఖ రాయాలన్నది మా డిమాండ్. గ్రామీణ ఉపాధి కొత్త చట్టంలో రాష్ట్రం 40% భరించాలని కేంద్రం సవరణ చట్టంలో పేర్కొన్నది. దీనిపైన ఇప్పటికీ సీఎం స్పందించలేదు. ఇప్పటివరకు ప్రకటన కూడా ఇవ్వలేదు. వీటిని బడ్జెట్‌లో పెట్టాలనేది జాగృతి డిమాండ్. బహుశా ఇదే ఫుల్ బడ్జెట్ అవుతుంది. వచ్చే ఏడాది నుంచి ఎలక్షన్ సందడి ఉంటుంది.‘ అంటూ కవిత పేర్కొన్నారు.
ఉద్యమకారుల ఆత్మగౌరవం నిలబెడతాం
ఆర్టీసీ కల్యాణ మండపంలో ఉద్యమకారుల ఆత్మీయ సభను ఈ నెల 12న పెట్టాం. జిల్లాల నుంచి వస్తారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది. మజ్లిస్ పార్టీ సన్ ఫ్లవర్ లాంటిది. సూర్యుడు ఎటువైపు ఉంటే అటు ఆ పువ్వు తిరుగుతుంది. అలా ఒవైసీ బ్రదర్స్ 2023 ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్ మనిషి అంటూ రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయనతోనే దోస్తీ చేస్తున్నారు. ఆ పార్టీ ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు రంజాన్ వస్తున్నది. ఇమామ్, మౌజమ్‌లకు నెలకు రూ. 6,000 నుంచి రూ. 12,000 కు పెంచాతామన్న కాంగ్రెస్ హామీని అమలు చేయాలని సీఎంను డిమాండ్ చేయాలి ఒవైసీ బ్రదర్స్. ఓల్డ్ సిటీ ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం బాగుపడింది?.. అభివృద్ధి గురించి సీఎంను ఎందుకు డిమాండ్ చేయట్లేదు?.. దేనికి మజ్లిస్ పార్టీ భయపడుతున్నది. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులు ఈ రెండేండ్లలో విడుదలైంది ఎంతో ఒవైసీ బ్రదర్స్, సీఎం వెల్లడించాలి.’ అంటూ కవిత ప్రశ్నలు సందించారు.


