కలం డెస్క్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి(Thippiri Tirupati) అలియాస్ దేవ్‌జీ ఇప్పటికే ఏపీ పోలీసులకు చిక్కారా..? ఆయన నుంచి వివరాలు రాబడుతున్నారా..? ఆయనకు ప్రొటెక్షన్ టీమ్ (బాడీగార్డులు)గా వ్యవహరించే తొమ్మిది మంది విజయవాడలో దొరకడం ఇందుకు బలం చేకూరుస్తున్నదా..? ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ లేదా డీజీపీ అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన చేసే అవకాశమున్నది. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు, కూంబింగ్ జరుగుతున్నందున అవి పూర్తయిన తర్వాత లాంఛన ప్రకటన వెలువడే అవకాశమున్నది. హిడ్మాను చత్తీస్‌గడ్‌లోనే పట్టుకుని మారేడుమిల్లి తీసుకొచ్చి కాల్చి చంపారని ఏపీ, తెలంగాణ పౌరహక్కుల సంఘాలు ఆరోపించాయి. దేవ్‌జీని కూడా అదుపులోకి తీసుకుని ఉండవచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
ప్రొటెక్షన్ టీమ్ సభ్యుల అరెస్టుతో క్లియర్?
ఆపరేషన్ కగార్ ఉధృతమై ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి(Thippiri Tirupati) అలియాస్ దేవ్‌జీని పట్టుకోవడంపై చత్తీస్‌గఢ్, కేంద్ర పోలీసు బలగాలు దృష్టి సారించాయి. పార్టీకి ఆయన ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారనే ప్రకటనలు వెలువడినా మావోయిస్టు పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దేవ్‌జీకి ఎల్లప్పుడూ రక్షణగా ఉండే ప్రొటెక్షన్ టీమ్‌లోని తొమ్మిది మంది సభ్యులను ఆక్టోపస్, గ్రేహౌండ్స్ పోలీసులు విజయవాడ సమీపంలోని పెనమలూరు ఆటోనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. దేవ్‌జీని అనుక్షణం కాపాడే వీరు ఆటోనగర్‌లోని ఒక భవనంలో ఉండడంతో అరెస్టయిన 27 మందిలో దేవ్‌జీ కూడా ఉన్నారనే అభిప్రాయం నెలకొన్నది. ఇదే విషయాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును మీడియా ప్రశ్నించగా.. అదుపులోకి తీసుకున్నవారిని లోతుగా ప్రశ్నించిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని, అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తామన్నారు.
Read Also: విజయవాడలో మావోయిస్టు అగ్రనేతలు.. 9 మంది దేవ్‌జీ బాడీగార్డుల అరెస్టు??
Follow Us on : Pinterest

