కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal Poll) ప్రచారం ముగిసింది. దీంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా చివరి అస్త్రంగా ప్రలోభాలకు తెరలేపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటుకు నోటు ఇచ్చేందుకు నగదు, మద్యం, బహుమతుల పంపిణీ జరుగుతున్నట్టు పలుచోట్ల సమాచారం అందుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్, మహబూబాబాద్, జనగామ, నర్సంపేటతోపాటు ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నల్లగొండ, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, వికారాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరుగనుంది. 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తం 2,996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 12,993 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 52 లక్షల మందిపైగా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
నగదు పంపిణీకి ఏర్పాట్లు
ప్రచారం బంద్ కావడంతో కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు నగదు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల వరకు రేటు నిర్ణయించినట్టు స్థానికంగా చర్చ సాగుతోంది. మరికొన్ని చోట్ల మద్యం భారీగా నిల్వ చేసి పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు చీరలు, గృహోపకరణాలు వంటి బహుమతులు ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల (Municipal Poll) ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచారం, ప్రలోభాలు చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘం హెచ్చరిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాలపై ఎన్నికల సంఘం, పోలీస్ యంత్రాంగం ఎంతవరకు కఠిన చర్యలు తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: కలం 360 డిగ్రీస్: మున్సిపోల్స్ స్పెషల్
Follow Us On : WhatsApp


