కలం, ఖమ్మం బ్యూరో : మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11 న జరగనున్నాయి. మరో పక్క ఐసీసి టి20 వరల్డ్ కప్ (T20 World Cup) ఈ నెల 7 నుంచే ప్రారంభం అయింది. దీంతో చాలా వరకూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు క్రికెట్‌కు పరిమితం అయినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారం చివరి రోజు కావడంతో జిల్లాలో (Khammam) వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలందరూ ప్రచారం ముమ్మరం చేశారు. ఆఖరి రోజు కీలక నేతలు సభలు, సమావేశాలు, ర్యాలీలతో పాటు ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో ర్యాలీలకు కార్యకర్తలు సరిపడా దొరక్కా కూలీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
వైరా (Wyra), మధిరలో (Madhira) భట్టి విక్రమార్క విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, చివరి రోజు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదులాపురం కూడళ్లలో ప్రచారం చేస్తున్నారు. కొత్తగూడెం, ఇల్లందులలో ఎంపీ రఘురామ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రచారం చేస్తున్నారు. సత్తుపల్లి, కల్లూరులో అభ్యర్ధుల విజయానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంఎల్ఏ మట్టా రాగమయి సోమవారం ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం (Khammam) పార్లమెంట్ పరిధిలోని పురపాలికల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్, డీసీసి అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, దేవి ప్రసన్న పర్యటించనున్నారు. వీరే కాక బీజేపీ, జనసేన, కమ్యూనిస్ట్ నేతలు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటనలు, ర్యాలీలు, కూడళ్ల ప్రదర్శనలు చేస్తుండటంతో కార్యకర్తల కొరతను ఎదుర్కొంటున్నారు. దీనితో పెయిడ్ కూలీల (Paid Coolies) మీద ఆధార పడటం జరిగింది.
ఒక్కసారిగా ప్రచారాలు ఊపందుకోవడంతో కూలీలకు డిమాండ్ పెరిగింది. కూలీలందరూ ప్రచారాలకు వెళ్తుండటంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని స్థానికులు చెప్తున్నారు. ఎలక్షన్లు ముగిసేవరకూ కూలీలు దొరికే పరిస్థితి లేదని మేస్త్రీలు చెప్తున్నారు. కూలీలు మాత్రం సరదాగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు.
Read Also: సూర్యకుమార్ నాయకత్వంపై గంభీర్ ప్రశంసలు
Follow Us On: Sharechat


