కలం, వెబ్ డెస్క్: ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అరవ శ్రీధర్ (Arava Sridhar) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మహిళ ఆరోపణలపై నిజానిజాలు తేల్చాలని సూచిస్తూ జనసేన పార్టీ అధిష్టానం ఓ విచారణ కమిటీని నియమించింది. ముగ్గురు సభ్యులతో ఉన్న ఈ కమిటీ నివేదిక అనంతరం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రెండు వారాలవుతున్నా ఈ కమిటీ అసలు విషయం ఏమిటన్నది తేల్చలేదు. దీంతో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల జేఎల్పీ మీటింగ్‌లో కూడా ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో విచారణ కమిటీ సభ్యులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారంలో మరోసారి విచారణ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి, పలువురు వ్యక్తులను విచారించనుంది.
మరోవైపు అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేస్తున్న హర్ష వీణ తాను పవన్ కల్యాణ్‌ను కలవాలని మరో వీడియో విడుదల చేసింది. అసలు విషయం పవన్‌కు ఎంత వరకు తెలుసన్న దానిపై ఆమె అనుమానం వ్యక్తం చేస్తోంది. నేరుగా పవన్ కల్యాణ్‌ను కలిసి తన సమస్య చెప్పుకోవాలని కోరుతోంది. మరి ఈ విషయం పవన్ కల్యాణ్ వరకూ వెళ్లిందా? వెళ్తే.. ఆయన ఎలా స్పందిస్తాడన్నది వేచి చూడాలి. ఇక అరవ శ్రీధర్ విచారణ కమిటీతో ఎంక్వైరీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది తన వ్యక్తిగత అంశమని, పార్టీకి దీన్ని ఆపాదించవద్దని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అంశంలో జనసేన ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి మరో వారం రోజులైనా పడుతుందని తెలుస్తోంది.


