కలం/ఖమ్మం బ్యూరో: వైరా అభివృద్ధి తన బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. వైరా ప్రాంత వాసిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరతానని స్పష్టం చేశారు. అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. ఆదివారం వైరా మున్సిపాలిటీ (Wyra Municipality) పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకొని భవిష్యత్తు తరాలకు ఒక మోడల్ వైరా పట్టణాన్ని తీర్చిదిద్దుదామన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు వైరా పట్టణ అభివృద్ధికి సంబంధించినవి, అభివృద్ధి చేసుకుందామా? లేదా? గత పది సంవత్సరాల మాదిరిగానే పట్టణాన్ని వదిలేద్దామా? అనేది ఓటర్లు ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం కోరారు.
కాంగ్రెస్ పాలనలోకే అభివృద్ధి
వైరా పట్టణంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనేనని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)గుర్తు చేశారు. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ కొత్తగా ఒక్క పని కూడా చేయలేదని పేర్కొన్నారు. శాంతి కాలనీ ఎస్సీ ఎస్టీ కాలనీ అన్ని కాంగ్రెస్ హయాంలో ఏర్పడినవే అన్నారు. కరెంటు, ఆసుపత్రి, కాలేజీ, డిగ్రీ కళాశాల అన్ని కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ వైరా పట్టణానికి ఓ వరం అన్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, విద్యా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు జూనియర్ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించామని తెలిపారు. ఐటీఐని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌గా మార్చామని గుర్తు చేశారు. పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరు చేశామన్నారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే షాపులను కూలగొట్టి ఐదేండ్లు అయ్యిందన్నారు. మొండి గోడలతో వైరా పట్టణం కళ తప్పిందని స్థానికులు తన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఫైల్ తెప్పించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్టు వివరించారు.
త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం
వైరాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఫైల్ వడివడిగా ప్రాసెస్ జరుగుతుంది అని తెలిపారు. ఇక్కడి ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడిన వారే కాబట్టి వైరా ప్రాజెక్టును అభివృద్ధి చేసుకోవాలని కుడి ఎడమ కాలువలకు లైనింగ్ చేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే రెండోదశ లైనింగ్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ చెరువు ఒడ్డున ఉండేది కానీ దాని ప్రధాన రహదారి మీదకు తీసుకొచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టిన ఘనత నాటి కాంగ్రెస్ సర్పంచ్ దుర్గాప్రసాద్‌కు దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Read Also: టికెట్ రానివాళ్లకు న్యాయం చేస్తాం : సీఎం రేవంత్
Follow Us On : WhatsApp


