కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలోని ఎన్నికలు జరగబోయే అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు తమకు వాగ్దానాలు, తాయిలాలూ ముఖ్యం కాదని, సమస్యలు పరిష్కరిస్తే చాలని అభ్యర్థులను కోరుతున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్య వరద ముంపు (Flood Issues). గ్రామ పంచాయతీ నుంచి పట్టణ పురపాలికగా అవతరించడంతో, అవస్థాపన సదుపాయాల కల్పన జరిగి జనావాసాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి వర్షాకాలంలో వరద సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని మధిర, కల్లూరు, వైరా, సత్తుపల్లి, ఎదులాపురం మున్సిపాలిటీల్లో ఎన్నికలు (Municipal Elections) జరగనుండగా ఈ అన్ని మున్సిపాలిటీల ప్రజలు వరద బాధితులేనని తెలుస్తోంది. మధిరలోని హనుమాన్ కాలనీ, వరద రాఘవపురం, ముస్లిం కాలనీలను అంబర్ పేట చెరువు నీరు ముంచుతుంది. వైరా నది ఒడ్డున ఉన్న లడక్ బజార్ వర్షాకాలంలో నీటిలోనే ఉంటుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతం 10 నుంచి 15 రోజులు నీటిలోనే తేలియాడుతుంది. అలాగే కల్లూరు మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్ లో నీళ్లు నిలుస్తున్నాయి. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారికి ఇరువైపులా మురుగు కాల్వలు నిర్మించకపోవడంతో వరద నీరు నిలిచి, రాక పోకలకు అంతరాయం కలుగుతుంది.
వైరాలోని ఇందిరమ్మ కాలనీని నల్ల చెరువు అలుగు నీరు ముంచెత్తుతుంది. వైరా జలాశయం నిండితే రాజీవ్ నగర్ జలమయమవుతుంది. అధికారులు ప్రతిపాదనలు పంపినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఎదులాపురంలో భారీ వర్షాలకు మున్నేరు నది ఉప్పొంగి, రాజీవ్ గృహ కల్ప, నాలుగో తరగతి కాలనీ, జలగం నగర్, ఆర్టీసీ కాలనీతో పాటు సమీపంలో ఉన్న కాలనీల ఇండ్లను ముంచెత్తుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో గల సత్యనారాయణ పురంలో గల 3, 5, 19, 20 వార్డులు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. బుగ్గ వాగు, ఇల్లందుల పాడు చెరువు సమీపంలో ఉన్న కాలనీలు జలమయం అవుతున్నాయి. మొత్తం మీద ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు మితి మీరిన వాగ్దానాలు, తాయిలాలూ ఆశ చూపకుండా వాస్తవంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడ్రస్ చేస్తేనే గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు స్థానిక ఓటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: లక్ష ఇచ్చాడు.. చిక్కుల్లో పడ్డాడు
Follow Us On : WhatsApp


