కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ జల్ బోర్డు (Delhi Jal Board) నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణం తీసింది. దేశరాజధానిలోని జనక్ పురి ప్రాంతంలో జల్ బోర్డు అధికారులు తవ్విన గుంతలో పడి ఓ బైక్ రెడర్ మృతి చెందాడు. గుంత చుట్టు పక్కల ఎటువంటి ప్రమాద సూచికలు లేకపోవడంతో సదరు యువకుడి బైక్ గుంతలో పడిపోయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై ఆప్ నేత, మాజీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రోడ్డుపై లోతైన గుంతలో పడి ఓ బైకర్ మృతి చెందాడని.. ఆ యువకుడు రాత్రంతా అక్కడే చిక్కుకుని నరకయాతన అనుభవించి చివరకు చనిపోయాడని పేర్కొన్నారు. జనక్‌పురి డిస్ట్రిక్ట్ సెంటర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో ఢిల్లీ జల్ బోర్డు పనులు జరుగుతున్నాయని, వాటి కోసం రోడ్డుపై ఢిల్లీ జలబోర్డు (Delhi Jal Board) అధికారులు గుంత తవ్వారు.
చనిపోయిన బైక్ డ్రైవర్‌ను కమల్‌గా గుర్తించారు. కమల్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రోహిణి బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి కమల్ తన బ్యాంక్ పని ముగియగానే ఇంటికి బయలుదేరాడు. మరో 10 నిమిషాల్లో వచ్చేస్తానని కుటుంబసభ్యులకు చెప్పాడు. కానీ తర్వాత ఫోన్‌కు పలుమార్లు కాల్ చేసినా స్పందన రాలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తర్వాత కొంతసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని తెలిపారు. ఆయన కోసం పలుచోట్ల పోలీస్ స్టేషన్లకు వెళ్లి గాలించినట్లు కుటుంబం వెల్లడించింది. అయితే చివరకు శుక్రవారం తెల్లవారుజామున జనక్ పురి ప్రాంతంలోని ఓ గుంతలో కమల్ మృతదేహాన్ని గుర్తించారు. ఇటీవల ఢిల్లీలో వరస ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం నోయిడా సెక్టార్ 150లో నిర్మాణ స్థలం పక్కన నీటితో నిండిన గుంతలో కారు పడిపోవడంతో యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా (27) మృతి చెందిన విషయం తెలిసిందే.


