కలం, వెబ్ డెస్క్: ఏపీ పోలీసులపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా(Roja) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు(Police) పసుపు చొక్కాలు వేసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబాన్ని రోజా పరామర్శించారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసిన నేపథ్యంలో ఇంటిని సందర్శించి పరిశీలించారు. లడ్డూ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ అంబటి, జోగి ఇండ్లపై దాడి చేసిందని ఆరోపించారు. టీడీపీ నేతలు , కార్యకర్తలు రాడ్లతో దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ దాడుల వెనుక నారా లోకేష్, చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు.
అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్లి ఆయన కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించారని రోజా వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టిన వాళ్లను వదిలేసి పోలీసులు బాధితుడైన అంబటి రాంబాబుపై కేసు పెట్టారని తెలిపారు. కూటమి పాలనలో 18 నెలలుగా జోగి రమేష్ కుటుంబాన్ని వేధిస్తున్నారని పేర్కొన్నారు. జోగి రమేష్‌తో పాటు ఆయన భార్య, కుమారుడిపైనా కేసులు పెట్టారని చెప్పారు. టీడీపీ నేతలే బూతులు తిట్టి రెచ్చగొడుతున్నారని, అంబటి, జోగి రమేష్ ఏం మాట్లాడారని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ, జనసేనలో చాలామంది నీచాతినీచంగా మాట్లాడారని విమర్శించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రోజుకో వేషం వేస్తున్నారని రోజా విమర్శించారు. లడ్డూలో జంతు కొవ్వులు లేవని సీబీఐ నివేదిక ఇచ్చిందని, ఇప్పుడు పవన్ కల్యాణ్ మెట్లు కడుగుతాడా, దీక్షలు చేస్తాడా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజలు, ప్రతిపక్షాలకు రక్షణ లేదని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రోజా డిమాండ్ చేశారు.


