epaper
Wednesday, February 18, 2026
epaper

ఇవి కార్యకర్తల ఎన్నికలు : రేవంత్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ : ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు.. కార్యకర్తల ఎన్నికలని, కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చినప్పుడే పార్టీ బలపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎన్నికలను ఆయన కార్యకర్తల ఎన్నికలుగా పేర్కొన్నారు. కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇచ్చినప్పుడే పార్టీ పటిష్టంగా మారుతుందని, కాబట్టి ప్రతి నాయకుడు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అధికార పార్టీలో టికెట్ల కోసం పోటీ ఉండటం సహజమని పేర్కొంటూ, కాంగ్రెస్ బీ-ఫామ్ దక్కించుకున్న అభ్యర్థులు అదృష్టవంతులని, అయితే టికెట్ రాని వారిని కూడా కలుపుకుని సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు గెలుపోటములను శాసిస్తుందని ఆయన గుర్తు చేశారు.

గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వకపోయినా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ కార్డులు అందజేసిందని రేవంత్ రెడ్డి వివరించారు. రెండేళ్ల కాలంలోనే పేదలకు సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ముఖ్యంగా మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, మహిళా గ్రూపులకు సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలు అందించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన ఈ అభివృద్ధి పనులను, పథకాల లబ్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. రాజకీయాల్లో డబ్బు కంటే నమ్మకమే ముఖ్యమని, మనం చేసిన మంచిని ప్రజలకు వివరించి వారి నమ్మకాన్ని గెలుచుకోవాలని అభ్యర్థులకు చెప్పారు.

అభివృద్ది పనులకు శంకుస్థాపన..

చొప్పదండి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి (Revanth Reddy) పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రామడుగులో 45.15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు, గంగాధర మండలం మధురానగర్ లో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి ఆయన పునాది వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: టాక్సీ రంగంలో కొత్త విప్లవం.. ఢిల్లీలో ‘భారత్ టాక్సీ’ సేవలు షురూ, తక్కువ ధరకే రైడ్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>