కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ (Delhi)లో వరుస కిడ్నాప్ (Kidnap)లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభమైన తొలి 15 రోజుల్లోనే రాజధానిలో ఏకంగా 807 మంది అదృశ్యమైనట్లు(Missing) పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో నగరవాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే గత సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే, ఇది ఎక్కువేం కాదని అధికారులు చెబుతున్నారు. 2025లో ఢిల్లీ నగరంలో సగటున నెలకు 2 వేల మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి 15వ తేదీ మధ్య రోజుకు సగటున 54 మంది అదృశ్యమవుతున్నారు. మొత్తం మిస్సింగ్ కేసుల్లో 509 మంది మహిళలు, బాలికలు, కాగా 298 మంది పురుషులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు పోలీసులు 235 మందిని గుర్తించగా ఇంకా 572 మంది ఆచూకీ లభించాల్సి ఉంది.
మిస్సింగ్ కేసుల్లో పిల్లలు, ముఖ్యంగా టీనేజ్ బాలికలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. జనవరి నెలలో 191 మంది పిల్లలు అదృశ్యమైనట్లు సమాచారం. సోషల్ మీడియాలో మిస్సింగ్ కేసులకు సంబంధించిన పోస్టులు వైరల్ కావడంతో భయం మరింత పెరిగింది. ఈ భయాందోళనల ప్రభావంతో ఒంటరిగా నివసించే కొంతమంది మహిళలు తమ మొబైల్ ఫోన్ వాల్ పేపర్లను ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లతో మార్చుకున్నారు. అయితే గత గణాంకాలను పరిశీలిస్తే ఢిల్లీలో ఈ పరిస్థితి కొత్త కాదు అనిపిస్తోంది. 2025 జనవరిలో 1,420 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా 2024లో 1,602 కేసులు, 2023లో 2,432 కేసులు, 2022లో 1,180 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


