కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీపి కబురు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ (Rythu Bharosa) నిధుల విడుదలపై సీఎం కీలక ప్రకటన చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని గూడూరులో జరిగిన ‘ప్రజా విజయోత్సవ’ సభలో పాల్గొన్న ఆయన సాగు పెట్టుబడి సాయంపై ప్రకటన చేశారు. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే, అర్హులైన రైతులందరికీ ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతు భరోసా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 9,000 కోట్లను సిద్ధం చేసిందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు పడిన ఇబ్బందులను గుర్తు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రూ. 21,000 కోట్ల రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులకు విముక్తి కలిగించామని చెప్పారు. వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. శాటిలైట్ సర్వే ద్వారా కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే నిధులు ఇచ్చి, ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Read Also: మిర్యాలగూడలో ఫోన్ పే బ్యాచ్‌లు : ఎమ్మెల్యే బీఎల్ఆర్
Follow Us On: Pinterest


