కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్యం నడుస్తోందని వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అన్నారు. బుధవారం గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించి.. వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైసీపీ అధినేత ఆరోపించారు. తిరుమల లడ్డూలో ఎటువంటి జంతువుల అవశేషాలు లేవని ఎన్డీడీపీ ల్యాబ్, ఎన్డీఆర్ఐ తేల్చి చెప్పాక కూడా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
తిరుమల లడ్డు (Tirumala Laddu) వ్యవహారంలో తమ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లినందుకే సీబీఐ ఎంక్వైరీ వేశారని పేర్కొన్నారు. తాము తిరుమల లడ్డు విషయంలో ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పదే పదే తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తిరుమల లడ్డును తమ పార్టీ నేతలు అపవిత్రం చేసి ఉంటే సీబీఐ చార్జ్ షీట్‌లో తమ పార్టీనేతల పేర్లు ఉండేవని పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి పేరు, భూమన కరుణాకర్ రెడ్డి పేరు సీబీఐ చార్జ్ షీట్ లో ఎందుకు లేవని.. వారిని ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్ ప్రశ్నించారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకున్నారని.. లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి తమ మీదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గోబెల్స్ ప్రచారం చేస్తూ పదే పదే ఒకే అబద్ధాన్ని చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కులమతాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. టీడీపీ పెట్టిన ఫ్లెక్సీలు తప్పు అని చెప్పినందుకు తమ నేత అంబటి రాంబాబు మీద దాడి చేశారని పేర్కొన్నారు.
అంబటి రాంబాబు (Ambati Rambau) గుడికి వెళ్లి వస్తుంటే కర్రలు, రాడ్లు పట్టుకొని టీడీపీ నేతలు అడ్డగించారని.. పచ్చి బూతులు తిట్టారని పేర్కొన్నారు. ఆ బూతులు తిడుతుంటే అంబటి రాంబాబు తాను ప్రతి స్పందించారని చెప్పారు. దానికే ఆయన మీద తప్పుడు కేసు పెట్టారని.. ఇంటికి వచ్చి విధ్వంసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని మేము కూడా రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఊరుకుంటారా? అని జగన్ (YS Jagan) ప్రశ్నించారు.
Read Also: మరో ఆరుగురితో అరవ శ్రీధర్‌కు లింక్స్.. బాధితురాలి సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Sharechat


