కలం, వెబ్ డెస్క్: ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. గేమ్‌లు ఆడనివ్వకుండా తల్లిదండ్రులు అడ్డుకుంటున్నారనే మనస్తాపంతో ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు (Minor Sisters) భవనం పైనుంచి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం ఘజియాబాద్‌లో (Ghaziabad) చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం… ఘజియాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలో 9వ అంతస్తులో నివసిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు పాఖీ(12), ప్రాచీ(14), విశిక(16) బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో భవనం పై నుంచి కిందకు దూకారు. పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
కొరియన్ టాస్క్ బేస్డ్ గేమ్‌కు అలవాటై:
కొన్ని వారాలుగా ఈ ముగ్గురు బాలికలు ఆన్‌లైన్ గేమ్‌లకు (Online Gaming) బానిసలయ్యారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒక కొరియన్ టాస్క్ బేస్డ్ గేమ్‌కు (Task Based Online Game) వీరు ఆకర్షితులయ్యారని సమాచారం. చదువును నిర్లక్ష్యం చేస్తూ, స్కూలుకు కూడా వెళ్లకుండా గంటల తరబడి ఫోన్లతో గడపడంపై తల్లిదండ్రులు వారిని మందలించారు. ఫోన్లను వాడవద్దని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరు కేవలం గేమింగ్‌కే పరిమితం కాకుండా, తమను తాము కొరియన్లుగా భావిస్తూ వింతగా ప్రవర్తించేవారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఘటన జరిగిన చాలా సేపటి తర్వాత పోలీసులు ఓ సూసైడ్ నోట్ గుర్తించారు. అయితే ఇది నోట్ రూపంలో కాకుండా డైరీలో ముందుగానే రాసి పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. “సారీ పాపా.. సారీ మమ్మీ.. ఈ డైరీలో రాసిందంతా నిజం.. దీన్ని పూర్తిగా చదవండి.. ఎందుకంటే మేం రాసినవన్నీ నిజాలే..” అని ఆ పిల్లలు డైరీలో రాసుకున్నారని పోలీసులు వివరించారు. బాలికలు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలో వారు ఏయే గేమ్స్ ఆడారు? ఎవరితో మాట్లాడారు? అనే కోణంలో ఫోరెన్సిక్ విచారణ చేపడుతున్నారు. “ముగ్గురూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత సన్నిహితంగా ఉండేవారని, స్నానం చేయడం నుండి నిద్రపోవడం వరకు అన్నీ కలిసే చేసేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆన్‌లైన్ గేమింగ్ వారి మానసిక స్థితిని ఏ విధంగా ప్రభావితం చేసిందో లోతుగా విచారిస్తున్నాం” అని ఏసీపీ అతుల్ కుమార్ సింగ్ తెలిపారు.

Read Also: న్యాయవాదిగా మారనున్న సీఎం మమతా బెనర్జీ
Follow Us On : WhatsApp


