కలం, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) కోసం పాకిస్థాన్ జట్టు.. శ్రీలంకకు చేరుకుంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టోర్నీకి జట్టు సన్నాహాలు మొదలుపెట్టింది. సోమవారం జట్టు లాహోర్ నుంచి కొలంబోకు చేరిందని పీసీబీ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది. జట్టు మంగళవారం విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపింది. తదుపరి ఫిబ్రవరి 4న ఐర్లాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనున్నట్లు పేర్కొంది. ఈ మ్యాచ్ కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరగనుంది.
ఈసారి 15 మంది సభ్యుల జట్టుకు సల్మాన్ అలీ ఆఘా కెప్టెన్‌గా ఉన్నారు. బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) శ్రీలంక, భారత్ వేదికలుగా ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. అదే గ్రౌండ్‌లో పాకిస్థాన్ తొలి రెండు గ్రూప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ పోటీ పడనుంది. ఫిబ్రవరి 10న అమెరికాతో రెండో మ్యాచ్ జరగనుంది.
మూడో గ్రూప్ మ్యాచ్ ఫిబ్రవరి 18న నమీబియాతో ఉంది. అయితే భారత్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్‌పై రాజకీయ పరిస్థితుల ప్రభావం కనిపిస్తోంది. ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. టోర్నీలో పాకిస్థాన్ ప్రయాణం ఎలా సాగుతుందన్నదానిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది.


