epaper
Wednesday, February 18, 2026
epaper

ట్యాపింగ్ అయిన ఫోన్‌లన్నింటికీ అప్రూవల్ ఉందా?

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కొన్ని అంశాలు ఇప్పటికీ సందేహాస్పదంగానే ఉన్నాయి. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఎంపిక చేసిన ఫోన్లను ట్యాపింగ్ చేసి సంభాషణలను వినొచ్చంటూ స్వయంగా కేటీఆరే చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ఇది కామన్‌గా జరిగే ప్రక్రియేనని, తెలంగాణలోనూ అది ఒక ప్రాక్టీసేనని కూడా వ్యాఖ్యానించారు. అయితే చట్టబద్ధంగా ట్యాపింగ్ చేసేందుకు నిర్దిష్టంగా ఎన్ని నెంబర్లకు ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది?.. అది లేకుండానే ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి?.. అనధికారికంగా చేరిన ఫోన్ నెంబర్లు ఎన్ని?.. వీటిని ఇచ్చిందెవరు?.. ఇలాంటివన్నీ ఇప్పటికైతే సమాధానాలు లేని ప్రశ్నలుగానే ఉండిపోయాయి. “దొంగలవో.. లంగలవో.. కొన్ని ఫోన్లు ట్యాపింగ్ అయితే అయ్యుండొచ్చు..” అంటూ పలు సందర్భాల్లో కేటీఆర్ కామెంట్ చేశారు. ఆ దొంగలు.. లంగలు.. ఎవరనేది ఇప్పుడు తేలాల్సి ఉన్నది.

అనుమతులొచ్చిన తర్వాతే ఫోన్ ట్యాపింగ్ :

చట్టబద్ధంగా కొన్ని సెలెక్టెడ్ ఫోన్ నెంబర్లను ప్రభుత్వాలు ట్యాపింగ్ చేయవచ్చని, ఇందుకు నిర్దిష్టంగా కొన్ని అనుమతులు, ఆమోదాలు అవసరమని సచివాలయ అధికారులు పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా ఆ విభాగం నుంచి హోంశాఖకు ప్రతిపాదనలు వెళ్ళిన తర్వాత పరిశీలించి నిర్ణయం జరుగుతుందని గుర్తుచేశారు. అక్కడ సానుకూల స్పందన రాగానే దాన్ని చీఫ్ సెక్రటరీ పరిశీలన, ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాతనే చట్టబద్ధంగా ఆ నెంబర్లను ట్యాపింగ్ చేయడం వీలవుతుందని, వాటి ద్వారా తెలుసుకున్న సమాచారానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటుందన్నారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కల్గించే చర్యలతో పాటు దేశ రక్షణ, భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించే నెంబర్లను ట్యాపింగ్ చేస్తారని గుర్తుచేశారు. ఇవన్నీ రికార్డుల్లో (ఫైళ్ళ రూపంలో) నిక్షిప్తమవుతాయని వివరించారు.

సచివాలయ వర్గాల్లోనూ సందేహాలు :

ప్రభుత్వం ట్యాపింగ్ కోసం అనుమతి ఇచ్చిన నెంబర్లు కాకుండా అదనంగా చేరినవాటిపైనే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్లుగా భావించే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న నెంబర్లు కాకుండా కొన్ని నెంబర్లు అదనంగా వచ్చి చేరాయన్నది సిట్ పోలీసుల అనుమానం. ఆ నెంబర్లను ఎవరిచ్చారు?.. ఎందుకు ట్యాపింగ్ జాబితాలో చేర్చాల్సి వచ్చింది?.. చట్టబద్ధంగా అనుమతి లేకపోయినా ఎందుకు చేరాయి?.. అవి ఏ అవసరాలకు ఉపయోగపడ్డాయి?.. అనధికారికంగా స్లిప్పుల ద్వారా కొత్తగా చేరిన నెంబర్లు ఎవరివి?.. ఇవన్నీ సీక్రేట్‌గానే ఉండిపోయాయి. చట్టవిరుద్ధంగా ఫోన్లను ప్రణీత్‌రావు ట్యాపింగ్ (Phone Tapping) చేసినట్లు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలోనే పేర్కొన్నారు. సెల్‌ఫోన్లను ఇంటర్‌సెప్ట్ చేయడానికి ప్రత్యేక టూల్స్ వాడారని, ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్ నుంచి చేసే కాల్స్ ను కూడా ఇది టాపింగ్ చేయగలుగుతుందని వెల్లడించారు. ఎస్ఐబీ విభాగంలో ప్రణీత్‌రావు ఆఫీసులో ప్రత్యేకమైన టూల్స్ వాడినట్లు తెలిపారు. దాని ఆధారంగానే చాలామంది ప్రొఫైల్స్ తయారయ్యాయన్నారు.

రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్‌గా :

ఫోన్ ట్యాపింగ్‌తో అన్నింటిపైనా కేసీఆర్‌కు పూర్తి కంట్రోల్ వచ్చిందన్న అభిప్రాయం గత ప్రభుత్వంలోనే వినిపించింది. అప్పజెప్పిన టాస్క్ లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినందుకు జిల్లాల్లోనూ చాలామంది పోలీస్ అధికారులకు కీలకమైన పోస్టింగులూ వచ్చాయి. వ్యతిరేక వార్తలు వస్తే కేసీఆర్ చిరాకు పడేవారని, అందువల్లనే ఎక్కువగా రాజకీయ ప్రత్యర్థులపైనే ఫోకస్ పెట్టారని, వారి సమాచారాన్ని తెలుసుకోడానికే ట్యాపింగ్ వాడినట్లు రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సైతం వెల్లడైంది. మునుగోడు ఉప ఎన్నిక సహా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక వనరులు కదలికలు, వాటిని అరికట్టడానికి ఫోన్ ట్యాపింగ్‌ ఉధృతంగా వినియోగించినట్లు పేర్కొన్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్, టెర్రరిస్టులు, వామపక్ష తీవ్రవాదుల ఫోన్లను ట్యాపింగ్ చేసే నెపంతో రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్ రూఢీ చేసినట్లయింది. స్లిప్పుల ద్వారా అనధికారికంగా చేరిన నెంబర్లన్నీ ఇలాంటివేనా అనే గుసగుసలు మొదలయ్యాయి. సిట్ దర్యాప్తు అనంతరం సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో వివరాలు వెల్లడయ్యే అవకాశమున్నది.

Read Also: KCR ఎంక్వయిరీ టైమ్‌లో సంతోష్ లేడెందుకు? బీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>