కలం, నల్లగొండ బ్యూరో: హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై (Hyderabad-Vijayawada Highway) దారుణం జరిగింది. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ డ్రైవర్ కత్తిపోటుకు గురయ్యాడు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్ అనే డ్రైవర్ మంగళవారం నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో నార్కట్‌పల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. దీంతో డ్రైవర్ ఇమ్రాన్ సదరు వ్యక్తిని కారులో ఎక్కించుకున్నాడు. చిట్యాల (Chityala) సమీపంలోకి రాగానే సదరు గుర్తుతెలియని వ్యక్తి డ్రైవర్ ఇమ్రాన్‌పై ఆకస్మికంగా కత్తితో దాడి చేశాడు. ఆపై డ్రైవర్ వద్ద మొబైల్ లాక్కునేందుకు ప్రయత్నించాడు.
దీంతో డ్రైవర్ ప్రతిఘటించడంతో ఆక్కడి నుంచి పరారయ్యాడు. కత్తి వేటుకు ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. సదరు నిందితుడు కేవలం మొబైల్ ఫోన్ కోసమే దాడి చేశాడా? ఇంకేదైనా కారణం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. లేదంటే కారులో ఇద్దరి మధ్య ఏదైనా ఘర్షణ జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు బీహార్ ప్రాంతానికి చెందిన వాడని తెలుస్తోంది.
Read Also: ప్రైవసీతో ఆటలొద్దు.. ‘మెటా’ డేటా చోరీపై సుప్రీం ఆగ్రహం
Follow Us On: Sharechat


